అల్పపీడనం ఎఫెక్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీగా వర్షాలు, జాగ్రత్తగా ఉండండి

Wait 5 sec.

తెలంగాణకు అధికారులు మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో నేడు, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన నేడు, రేపు (గురువారాల్లో) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది.నేడు ముఖ్యంగా హనుమకొండ, వరంగల్‌, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, ఆసిఫాబాద్‌, ములుగు, సిరిసిల్ల, జనగాం, మెదక్‌, వనపర్తి, కామారెడ్డి, నిర్మల్‌, నారాయణపేట్‌ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ సంచాలకులు డాక్టర్‌ నాగరత్న వెల్లడించారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్డ్ జారీ చేశారు. ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.గురువారం కూడా రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొనసాగే అవకాశం ఉందన్నారు. ఈ వర్షాలు హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో ప్రభావం చూపవచ్చని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా, రైతులు, ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో రహదారులు జలమయం అయ్యే అవకాశాలు ఉన్నందున, ప్రయాణించేటప్పుడు జాగ్రత్త వహించాలని కోరారు. అలాగే, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షితమైన ప్రదేశాలకు వెళ్లడం మంచిదని అన్నారు. ఇక హైదరాబాద్ నగరంలో గతరాత్రి నుంచి వర్షం కురిస్తూనే ఉంది. మంగళవారం సాయంత్రం మెుదలైన వాన ఎడతెరిపి లేకుండా పడుతూనే ఉంది. మంగవారం అర్థరాత్రి భారీ వర్షం కురిసింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో వర్షం జోరుగా కురిసింది. ప్రస్తుతం కూడా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో చాలా ప్రాంతాల్లో రహదారులపై వర్షం నీరు వచ్చి చేరింది. మరో రెండ్రోజులు వర్షం కురుస్తుందన్న వాతావరణశాఖ సూచన మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.