ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేస్తున్నారా.. టీడీపీ ఎంపీలతో కలిసి నారా లోకేష్ కేంద్రంలో ఎన్డీయేపై అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నారా.. అసలు ఇదంతా సాధ్యమేనా.. నో ఛాన్స్, అలా జరిగే అవకాశమే లేదు. అయితే చంద్రబాబు రాజీనామా, ఎన్డీయేపై అవిశ్వాసం పేరుతో రెండు రోజులుగా సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఉత్తరాది సోషల్ మీడియాలో ఈ ప్రచారం నడుస్తోంది. ఈ క్రమంలో టీడీపీ స్పందించింది.. తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు అసలు ఏం జరిగిందో చెప్పారు.'ఉత్తరాది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫేక్ ప్రచారం ఇది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రాజీనామాకు సిద్ధమయ్యారని... ఆయన కుమారుడు లోకేష్ తమ రాష్ట్రానికి చెందిన 16 మంది ఎంపీలతో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం పై పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం పెట్టనున్నారని ఈ ప్రచార సారాంశం. ఇది పూర్తిగా అవాస్తవం' అని టీడీపీ తెలిపింది. బీహార్‌లో ఎన్నికల జరగనున్న సమయంలో కొందరు ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రచారం వెనుక ఎవరున్నారో ఆరా తీస్తున్నారు. ఏకంగా చంద్రబాబు రాజీనామా పేరుతో ప్రచారం చేయడం కలకలం రేపింది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిలో టీడీపీ కీలకంగా వ్యవహరిస్తోంది. 2024 ఎన్నికల్లో టీడీపీకి 16మంది ఎంపీలు గెలిచారు.. ఏపీ నుంచి ఎన్డీయ కూటమికి మొత్తం 21మంది (టీడీపీకి 16, బీజేపీకి 3, జనసేన పార్టీకి 2 ఎంపీలు) బలం ఉంది. టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎంపీలు కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌ కేంద్రమంత్రులుగా ఉన్నారు. కింజరాపు రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అందుకే టీడీపీ ఎన్డీయేలో కీలకంగా ఉండటంతో కొందరు టార్గెట్‌ చేసి ఇలా ప్రచారం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫేక్ ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని టీడీపీ సోషల్ మీడియా వేదికగా తెలిపింది.