తెలంగాణలో కుండపోత వానలు.. నేడు ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు

Wait 5 sec.

తెలంగాణలో ఆగస్టు నెల ప్రారంభం నుంచి వర్షాలు కురుస్తుండగా.. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రరూపం దాల్చటంతో వర్షాలు మరింత తీవ్రమయ్యాయి. కొన్ని జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. దీంతో వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.భారీ వర్షాలు నేడు కూడా కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు. హైదరాబాద్, కామారెడ్డి, మెదక్, మేడ్చల్, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇక మిగిలిన 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు, అక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయన్నారు. భారీ వర్షాల ప్రభావం గత 14 గంటల్లోనే ఈ జిల్లాలో దాదాపు 500 మిల్లిమీటర్ల (50 సెంటీమీటర్లు) వర్షపాతం నమోదైందని వాతావరణ అధికారులు వెల్లడించారు. సాధారణంగా 100-200 మిల్లీమీటర్ల వర్షానికే వరదలు వచ్చే పరిస్థితులు నెలకొంటాయని.. అలాంటిది కేవలం గంటల వ్యవధిలోనే ఇంత భారీ వర్షం కురవడంతో అనేక గ్రామాలు నీట మునిగాయి. హైవేలు, ప్రధాన రహదారులు వరద ప్రవాహంలో చిక్కుకోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.కామారెడ్డి జిల్లాలోని రాజంపేటలో బుధవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు 136 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. ఆ తర్వాత వర్షం తీవ్రత మరింత పెరిగి, ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఏకంగా 363 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ పరిస్థితి చూసి గతంలో ఎన్నడూ ఇంతటి వర్షం చూడలేదని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో వర్షాలు ఇంకా కొనసాగుతాయని.. మొత్తం వర్షపాతం 550-600 మిల్లీమీటర్లకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం జోరుగా వర్షం కురుస్తోంది. తెల్లవారుజాము నుంచే వర్షం మెుదలైంది.