తెలంగాణలో ఈ నేపథ్యంలో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని పలు జిల్లాల్లోని పాఠశాలలకు అధికారులు సెలవులు ప్రకటించారు. ప్రధానంగా భారీ వర్షాల ప్రభావం అధికంగా ఉన్న కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, నిర్మల్, కొమురం భీం జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చారు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున రెడ్ అలర్ట్ జారీ చేశారు. అంటే ఈ ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఇప్పటికే రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లాలో గత కొన్ని గంటల్లోనే దాదాపు 500 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని వాతావరణ నిపుణులు వెల్లడించారు. ఈ అసాధారణ వర్షపాతం కారణంగా వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రోడ్లపై రాకపోకలు కష్టంగా మారాయి. చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ పరిస్థితుల్లో పాఠశాలలకు వెళ్లడం ప్రమాదకరమని భావించిన అధికారులు సెలవులను ప్రకటించారు. జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో అత్యంత భారీ వర్షపాతం కారణంగా అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. సిద్దిపేట జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిర్మల్ జిల్లాలోనూ రికార్డు స్థాయిలో వర్షం నమోదైంది, ప్రవహిస్తున్నాయి.ఈ ఐదు జిల్లాలతో పాటు, వర్షాల ప్రభావం ఎక్కువగా ఉన్న ఇతర జిల్లాల కలెక్టర్లు కూడా స్థానిక పరిస్థితులను బట్టి సెలవుల నిర్ణయం తీసుకునే అధికారం ఉందని ప్రభుత్వం తెలిపింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని, వరద నీరు ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో సహాయక చర్యల కోసం విపత్తు నిర్వహణ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ వర్షాలు మరో రెండు మూడు రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. భారీ వర్షాలు కురుస్తున్న కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో పరిస్థితిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో మెదక్, కామారెడ్డి జిల్లాల్లో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆ జిల్లాల కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎలాంటి విపత్కర పరిస్థితులొచ్చినా.. ఎదుర్కునేందుకు అన్ని విభాగాలను, అధికారులను సర్వసన్నద్ధంగా ఉండాలని, వెంటవెంటనే అవసరమైన సహాయక చర్యలను చేపట్టాలని చెప్పారు. పరిస్థితులకు అనుగుణంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల సాయం తీసుకోవాలని సీఎం రేవంత్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.