విజయనగరం ఉగ్రకుట్ర కేసు... ఢిల్లీలో కీలక నిందితుడు అరెస్ట్

Wait 5 sec.

విజయనగరం ఐఎస్ఐఎస్ ఉగ్ర కుట్ర కేసులో కీలక నిందితుడు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు పట్టుబడ్డాడు. బిహార్‌కు చెందిన అరీఫ్ హుస్సేన్ అలియాస్ అబూ తాలిబ్‌ను గురువారం అరెస్ట్ చేసింది. దేశంలో ఉంటూ జీహాదీ కార్యక్రలాపాలకు ఆరిఫ్ సిద్ధమైనట్టు ఎన్ఐఏ విచారణలో తేలింది. దేశం విడిచిపారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా అతడ్ని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అదుపులోకి తీసుకుంది. వివిధ ప్రాంతాల్లో ఉగ్రదాడులకు ఆరిఫ్ ఆయుధాలు, పేలుడు పదార్థాలను సమకూర్చుతున్నట్టు గుర్తించారు. ఐఈడీలతో బాంబు పేలుళ్లకు కెమికల్స్‌ను తీసుకెళ్తుండగా ఉగ్రవాదులు సమీర్, సిరాజ్‌లను ఈ ఏడాది మే నెలలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నిందితులు సిరాజ్, సమీర్‌లతో కలిసి ఆరిఫ్ కుట్ర చేసినట్టు తేలింది. రేపు (శుక్రవారం ఆగస్టు 29న) విశాఖపట్నం ఎన్ఐఏ కోర్టులో ఆరిఫ్‌ను అధికారులు హాజరుపరచనున్నారు. పేలుళ్లకు ఐఈడీల తయారీ కోసం కెమికల్స్ తీసుకెళ్తుండగా సమీర్, సిరాజ్‌లు అరెస్ట్ కావడంతో ఆరిఫ్ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో దేశం విడిచి పారిపోయే ప్లాన్ చేసిన ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఎన్ఐఏకు చిక్కాడు.ఈ కేసులో ఇప్పటికే ఆరుగురు వ్యక్తులు పట్టుబడ్డారు. వారిని విజయనగరం పోలీస్ అకాడమీలో విచారించారు. కాగా, సిరాజ్, సమీర్‌లు ఇంకో నలుగురితో కలిసి సామాజిక మాధ్యమాల్లో రహస్యంగా ఓ గ్రూప్‌ను ఏర్పాటు చేసుకుని.. చాటింగ్‌ చేసుకున్నట్టు విచారణలో గుర్తించారు. సిరాజ్, సమీర్ .. అల్‌హింద్‌ ఇత్తేహాదుల్‌ ముస్లిమీన్‌ (అహీం) అనే సంస్థను కూడా ఏర్పాటుచేసినట్టు తేలింది. ఈ నలుగురు యువకులు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వారిగా పోలీసులు ధ్రువీకరించారు.