తెలంగాణ రాజకీయాల్లో బీసీ రిజర్వేషన్ల అంశం మళ్లీ ప్రాధాన్యత సంతరించుకుంది. నేడు హైదరాబాద్ గాంధీభవన్‌లో జరిగిన పీఏసీ (PAC) సమావేశంలో కాంగ్రెస్ అగ్రనాయకులు ఈ విషయంపై చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (), టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, సలహా కమిటీ సభ్యులు పాల్గొన్న ఈ సమావేశంలో ప్రధాన అజెండా రాబోయే స్థానిక ఎన్నికల గురించే మాట్లాడుకున్నారు. సెప్టెంబర్ లోపలే సీఎం రేవంత్ రెడి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఇంకా పరిష్కారం కానందున ఇది ఎన్నికల వ్యూహంలో కీలకంగా మారింది. కాంగ్రెస్ శాసన సభలో ఎక్కువమంది నాయకులు బీసీ వర్గాల మద్దతు పొందడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. దీనికి అనుగుణంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, “రిజర్వేషన్ల సమస్య తీరికలేదన్నా, పార్టీ స్థాయిలో అయినా 42 శాతం సీట్లు బీసీలకే కేటాయించి ఎన్నికల్లోకి వెళ్ళాలి” అని అభిప్రాయపడ్డారు. అంటే పార్ట తరఫును ఈ రిజర్వేషన్లను బీసీలకు కల్పించనున్నారు. ఈ నిర్ణయం అమలులోకి వస్తే కాంగ్రెస్‌కు రాజకీయంగా రెండు లాభాలు ఉంటాయని విశ్లేషకులు అంటున్నారు. మొదటిగా.. బీసీ వర్గాల విశ్వాసం గెలుచుకోవచ్చు. రెండవది.. ప్రతిపక్ష పార్టీలపై ఒత్తిడి పెంచే అవకాశం ఉంటుంది. మరోవైపు.. ఇది సులభం కాదని కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే రిజర్వేషన్ల అమలులో చట్టపరమైన సమస్యలు, కేంద్రం నుండి అనుమతులు వంటి అడ్డంకులు ఉండొచ్చు. హైకోర్టు గడువు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఎన్నికలు తప్పనిసరి కావడంతో.. కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్లపై స్పష్టమైన భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ వేదికల్లో బీసీల అభ్యున్నతే తమ లక్ష్యం అని చెబుతున్నారు. ఈ సందర్భంలో తీసుకున్న నిర్ణయాలు, అమలు విధానం, చివరికి వచ్చే ఎన్నికల ఫలితాలపై పెద్ద ప్రభావం చూపుతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం మీద.. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశం అనేది కీలకం కానుంది. అంతే కాకుండా.. ఇదే అంశం రాష్ట్ర రాజకీయ సమీకరణాలపై గణనీయమైన ప్రభావం చూపించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లో జరిగిన కాంగ్రెస్ పీఏసీ సమావేశంలోనే పెండింగ్ కమిటీల ఏర్పాటుపై చర్చ జరిగింది. ఏఐసీసీ ఆదేశాల మేరకు "ఓటు చోరీ–గద్దీ ఛోడ్" ఉద్యమం చేపట్టాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి లోగోను కూడా ఆవిష్కరించారు. యూరియా కొరతపై భాజపా, భారత రాష్ట్ర సమితి చేస్తున్న రాజకీయాలు చర్చకు వచ్చాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వ్యూహాలపై సమాలోచనలు జరిగాయి.