ట్రంప్ దెబ్బకు భారీగా తగ్గిన అమెరికా వలసలు.. 65 ఏళ్ల తర్వాత తొలిసారిగా..!

Wait 5 sec.

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన .. సంచలన నిర్ణయాలతో ప్రపంచ దేశాలపైనా ప్రభావం చూపిస్తున్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (మాగా) నినాదంతో.. నిర్ణయాలు, విధానాలు, ఉత్తర్వులు వెలువరిస్తున్న ట్రంప్.. అమెరికన్లకే పెద్దపీట వేస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికాలో ఉన్న కంపెనీలు అమెరికన్లకే ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని చెబుతున్నారు. అదే సమయంలో విదేశాల నుంచి అమెరికాలోకి వచ్చే వలసదారుల విషయంలో కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. ఇక వీసా గడువు ముగిసిన వారు, అక్రమ మార్గాల్లో అమెరికాలోకి చొరబడినవారు, ఇతర అక్రమ వలసదారులను గుర్తించి.. వారి స్వదేశాలకు పంపించే కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలాగా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒకప్పుడు అమెరికా అంటేనే ఎగిరి గంతేసి వెళ్లే ప్రపంచ దేశాల ప్రజలు.. ఇప్పుడు అమెరికా పేరు చెబితే జంకుతున్నారు. ఈ క్రమంలోనే అమెరికాలోని వలసదారులపై ట్రంప్ తీసుకున్న కఠిన చర్యల కారణంగా.. తాజాగా ఆ దేశంలోకి వలసలు గణనీయంగా తగ్గాయని ప్యూ రీసెర్చ్ సెంటర్ విడుదల చేసిన ఒక రిపోర్ట్ స్పష్టం చేస్తోంది. ఈ ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్.. సంచలన నిర్ణయాలు వెలువరించారు. ఈ కారణంగానే జనవరి నుంచి జూన్ మధ్య గత 6 నెలల్లో ఏకంగా 15 లక్షల మంది వలసదారులు తగ్గినట్లు ఆ నివేదిక వెల్లడించింది. ఈ క్రమంలోనే మొత్తం వలసదారుల సంఖ్య 53.3 మిలియన్ల నుంచి 51.9 మిలియన్లకు పడిపోయినట్లు తెలిపింది. 1960ల తర్వాత అమెరికాలో ఇది తొలిసారి సంభవించిన పరిణామమని ఫ్యూ రీసెర్చ్ నివేదిక తేల్చి చెప్పింది. అయితే ఇలా జరగడం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు కీలకమైన శ్రామికశక్తి తగ్గిపోతోందని నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికాలో అమల్లోకి వచ్చిన కఠిన వలస విధానాలు ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆ నివేదిక వెల్లడించింది. అమెరికా నుంచి భారీగా బహిష్కరణలు, అరెస్ట్‌లు, చట్టపరమైన ప్రవేశాలపై ఆంక్షల కారణంగా వలసదారుల సంఖ్య గణనీయంగా క్షీణించిందని స్పష్టం చేసింది. అమెరికాలోకి వచ్చే వలసదారులు తగ్గిపోవడం వల్ల శ్రామికశక్తి 7.50 లక్షల మంది కార్మికులను కోల్పోయిందని ప్యూ రీసెర్చ్ సెంటర్ సీనియర్ డెమోగ్రాఫర్ జెఫ్రీ పస్సెల్ తెలిపారు. అమెరికాలో పనిచేసే వయసు గల జనాభా పెరగడం లేదని.. అలాంటప్పుడు అమెరికాలో శ్రామికశక్తి పెరగాలంటే ఇతర దేశాల నుంచి వలసదారులు రావాల్సిందేనని వెల్లడించారు. శ్రామికశక్తి పెరగకపోతే.. అమెరికా ఆర్థిక వ్యవస్థకు కష్టమేనని తీవ్ర హెచ్చరికలు చేశారు. అయితే గతంలో జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న 2024లోనే ఈ మార్పు కనిపించినప్పటికీ.. డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న కఠిన వైఖరితో ఇది మరింత క్షీణించినందని వెల్లడైంది. మరీముఖ్యంగా అనధికారికంగా అమెరికాలోకి వచ్చే వలసల సంఖ్య కూడా భారీగా తగ్గిందని ఆ రిపోర్ట్ తెలిపింది. ఇక భారీగా వలసదారుల జనాభా తగ్గిపోతున్నప్పటికీ.. ప్రపంచంలోనే అత్యధిక వలసదారులు కలిగి ఉన్న దేశంగా ఇప్పటికీ అమెరికానే కొనసాగుతోంది. కెనడా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు వలసదారుల సంఖ్యను పెంచుకోవడం విశేషం.