: దేశవ్యాప్తంగా .. రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా రాష్ట్రాల్లో రైతులు.. రోడ్డెక్కుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో యూరియా కొరత.. అన్నదాతలకు తీవ్ర తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలోనే ఇటు ఆంధ్రప్రదేశ్.. అటు తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలు.. యూరియాను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌కు.. కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వెంటనే యూరియాను అందించేందుకు అనుమతి ఇచ్చింది. వచ్చే వారం మరికొంత యూరియాను ఏపీకి అందించనున్నట్లు తెలిపింది. దీంతో రాష్ట్రంలో యూరియా కొరతతో అల్లాడిపోతున్న రైతులకు భారీ ఊరట లభించినట్లయింది.కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రితో చర్చలు జరిపిన ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు.. రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వం పరిష్కారం చూపిందని తెలిపారు. ఏపీకి తక్షణ అవసరాల కోసం 10,350 మెట్రిక్ టన్నుల యూరియాను జారీ చేసినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఆ యూరియాను దిగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం జీవో జారీ చేసినట్లు వెల్లడించారు. ఈ యూరియాను విశాఖపట్నంలోని గంగవరం పోర్ట్ ద్వారా దిగుమతి చేయనున్నట్లు పేర్కొన్నారు.ఈ క్రమంలోనే రాష్ట్రానికి రానున్న 10,350 టన్నుల యూరియాను.. అత్యవసరంగా ఎదురుచూస్తున్న జిల్లాలకు తక్షణమే సరఫరా చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వేగంగా యూరియాను రైతులకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. సెప్టెంబర్ 6వ తేదీన గంగవరం పోర్ట్‌కు యూరియా నౌక రావాల్సి ఉండగా.. రాష్ట్రంలో రైతుల అత్యవసరం దృష్ట్యా వారం ముందే ఆ యూరియా నౌక వచ్చేలా చర్యలు చేపట్టినట్లు అచ్చెన్నాయుడు వెల్లడించారు.ఇక సెప్టెంబర్ మొదటి వారంలో కాకినాడ పోర్టుకు మరో 30 వేల మెట్రిక్ టన్నుల యూరియాను పంపిస్తామని కేంద్ర ప్రభుత్వం.. హామీ ఇచ్చినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఆ యూరియాను కూడా రాష్ట్రంలో అవసరం ఉన్న రైతులకు అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రైతులకు ఎరువుల కొరత రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. ప్రతీ రైతుకు అవసరమైన సమయంలో అవసరమైనంత యూరియాను అందించేలా చర్యలు తీసుకుంటున్నామని అచ్చెన్నాయుడు తేల్చి చెప్పారు.