ఏపీలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లు.. కేబినెట్ కీలక నిర్ణయం, ఆ జిల్లాల దశ తిరిగినట్లే

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ఎయిర్‌పోర్టులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో చిత్తూరు జిల్లాలోని కుప్పం, నెల్లూరు జిల్లాలోని దగదర్తిలో కొత్త విమానాశ్రయాలపై చర్చించారు.. కుప్పం, దగదర్తిలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రెండు విమానాశ్రయాలను పీపీపీ (ప్రైవేట్ పబ్లిక్ పార్టనర్‌షిప్) విధానంలో అభివృద్ధి చేస్తారు. దీనికి సంబంధించిన ముయిసాదా ఆర్‌ఎఫ్‌పీని కేబినెట్ ఆమోదించింది. భూసేకరణ, యుటిలిటీల బదిలీ కోసం హడ్కో నుండి రుణం తీసుకుంటారు. విమానాశ్రయానికి కావలసిన మౌలిక సదుపాయాలను కల్పిస్తారు. దీనికి మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ ప్రతిపాదనలు చేయగా.. ఏపీ మంత్రిమండలి ఆమోదం తెలిపింది.కుప్పంలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన. దీని కోసం ఆయన చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. 2019 జనవరిలో శంకుస్థాపన చేసినా పనులు ముందుకు సాగలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో చంద్రబాబు మళ్లీ ఈ విషయంపై దృష్టి పెట్టారు. విమానాశ్రయం కోసం 1,200 ఎకరాల భూమిని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రక్రియను నాలుగు నెలల్లో పూర్తి చేయాలని భావిస్తున్నారు.నెల్లూరు జిల్లా దగదర్తిలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలనేది దశాబ్దాల కల.. ఇప్పుడుఅడుగులు వేగంగా పడుతున్నాయి. భూమిని సేకరించే పని దాదాపు పూర్తయింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపారు. దగదర్తిలో విమానాశ్రయం నిర్మాణం కోసం భూ సేకరణ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. కేబినెట్ గ్రీన్‌ సిగ్నల్ ఇవ్వడంతో ఈ పని మరింత వేగంగా జరుగుతుందని భావిస్తున్నారు. ఎయిర్‌పోర్ట్ కోసం దామవరం, సున్నపుబట్టి గ్రామాల పరిధిలో భూమిని సేకరించాలని నిర్ణయించారు. మొత్తం 1379.71 ఎకరాల భూమిని సేకరించాలని అనుకున్నారు. ఇప్పటివరకు 669.12 ఎకరాలు సేకరించారు. ఇంకా 710.59 ఎకరాలు సేకరించాల్సి ఉంది. మంత్రివర్గం ఆమోదంతో సమస్యలన్నీ తొలగిపోయి, విమానాశ్రయ నిర్మాణం వేగంగా ముందుకు సాగుతుందని భావిస్తున్నారు. కౌరుగుంటలో 67 మందికి చెందిన 87 ఎకరాల భూమిని సర్వే చేసి.. 30 మంది లబ్ధిదారులను గుర్తించారు. వారి వివరాలను ఆర్డీవో పరిశీలనకు పంపారు. మిగిలిన వారి వివరాలను కూడా సిద్ధం చేస్తున్నారు.. వీరికి పరిహారం అందాల్సి ఉంది. దామవరంలోని 418 ఎకరాల మేత పోరంబోకు భూములను నాలుగు బృందాలు సర్వే చేసి నివేదికను ఆర్డీవోకు అందజేశాయి. ఆర్డీవో దానిని పరిశీలించి కలెక్టర్ ఆమోదం కోసం పంపారు. మరో 125 ఎకరాల వివాదాస్పద భూముల గురించి హైకోర్టు ఆదేశించింది.. దాని ప్రకారం కలెక్టర్ విచారణ పూర్తి చేసి నివేదికను ఇచ్చారు. దగదర్తిలో విమానాశ్రయం కోసం భూమిని సేకరించే పని చివరికి వచ్చింది. కోర్టు కేసులు కూడా పరిష్కారమయ్యాయి.. త్వరగా భూసేకరణ పూర్తి చేసి రైతులకు నష్టపరిహారం ఇస్తామని అధికారులు తెలిపారు. ఏపీ ప్రభుత్వం చిత్తూరు జిల్లా కుప్పం, నెల్లూరు జిల్లా దగదర్తి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, పల్నాడు జిల్లా నాగార్జునసాగర్, తుని-అన్నవరం, ప్రకాశం జిల్లా ఒంగోలులో కొత్త విమానాశ్రయాలు కట్టాలని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.