గంజాయి నిర్మూలనకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పూర్తి ఫలితాలు కనిపించడం లేదు. రాష్ట్రంలో ఎక్కడో ఓ చోట గంజాయి సాగు, అమ్మకాలు, అక్రమ సరఫరా జరుగుతూనే ఉన్నాయి. గంజాయి, డ్రగ్స్ కట్టడికి ఏపీ ప్రభుత్వం ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ విభాగం సాయంతో గంజాయి, డ్రగ్స్ సరఫరాను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. దీంతో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడుతోంది. అయితే అక్కడక్కడా మాత్రం గంజాయి రవాణా గుట్టుగా సాగుతోంది. తాజాగా అనంతపురం జిల్లాలో గంజాయి అక్రమ సరఫరా వ్యవహారం బయటపడింది. ఇందుకోసం గంజాయి స్మగ్లర్లు ఎంచుకున్న పద్ధతిని చూసి పోలీసులు సైతం ఒకింత ఆశ్చర్యానికి గురయ్యే పరిస్థితి. సెల్‌ఫోన్‌లో ఆర్డర్ చేస్తే గంజాయిని డెలివరీ చేస్తున్న వైనం అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. ఇలా గంజాయిని అమ్ముతున్న ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి8.291 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఎక్సైజ్ పోలీసులు వెల్లడించారు. జూలై నెల 18న అనంతపురంలోని టీవీ టవర్‌ ప్రాంతంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో 418 గ్రాముల గంజాయి పోలీసులకు దొరికింది. దీంతో ఆ ప్రాంతంలో పోలీసులు నిఘా పెంచారు . ఈ క్రమంలోనే ఎన్టీఆర్‌ కాలనీకి చెందిన శీనా, బుడ్డప్ప నగర్‌కు చెందిన నాగమణి, వెంగమనాయుడు కాలనీకి చెందిన జునను అనే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారుగా 8 కిలోల గంజాయిని స్వాధినం చేసుకున్నారు. అనంతరం నిందితులను కోర్టు ఎదుట పరిచిన పోలీసులు.. కోర్టు రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు.మరోవైపు రాష్ట్రంలో గంజాయి సాగు, అక్రమ రవాణా కట్టడికి పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో డ్రోన్ల సాయంతో గంజాయి సాగును గుర్తించి ధ్వంసం చేస్తు్న్నారు. అలాగే శాటిలైట్ చిత్రాల సాయంతో గంజాయి సాగు వివరాలను తెలుసుకుంటున్నారు. గంజాయి సాగు చేస్తున్న వారిని ప్రత్యామ్నాయ పంటలవైపు ప్రోత్సహిస్తున్నారు. అలాంటివారికి వేరే లాభదాయక పంటలకు సంబంధించిన విత్తనాలు అందిస్తూ., సాగు విధానాలపై అవగాహన కల్పిస్తూ గంజాయి సాగు నుంచి మరల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.