తెలంగాణతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. నాగార్జున సాగర్ 26 గేట్లను పైకి ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. దీంతో సాగర్ ప్రాజెక్టు జలకళను సంతరించుకోగా.. పర్యాటకులు ఆ సుందర దృశ్యాలను చూసేందుకు క్యూ కడుతున్నారు. ఈనేపథ్యంలో హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వెళ్లాలనుకునే పర్యాటకులకు తెలంగాణ ఆర్టీసీ తీపి కబురు చెప్పింది. సాగర్‌తో పాటు శ్రీరంగాపురం, మంత్రాలయానికి ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతూ టూర్ ప్యాకేజీలను ప్రకటించింది. నాగార్జునసాగర్‌, ఎత్తిపోతల ప్రాజెక్టు టూర్‌ ప్యాకేజీమియాపూర్ ఆర్టీసీ-1 డిపో ఆధ్వర్యంలో నాగార్జునసాగర్‌, ఎత్తిపోతల ప్రాజెక్టుల సందర్శన కోసం ఒకరోజు టూర్‌ ప్యాకేజీని ఏర్పాటు చేశారు. ఈనెల 24వ తేదీ (ఆదివారం) ఉదయం 5 గంటలకు మియాపూర్ నుంచి సూపర్‌ లగ్జరీ బస్సు బయలుదేరుతుంది. ఈ టూర్‌లో పర్యాటకులు నాగార్జునసాగర్‌తో పాటు ఎత్తిపోతల ప్రాజెక్టును సందర్శించవచ్చు. రాత్రి 8 గంటలకు తిరిగి మియాపూర్‌కు చేరుకుంటారు. ఒక్కొక్కరికి రూ.1200 చొప్పున ఛార్జీ నిర్ణయించారు. టికెట్ బుకింగ్ లేదా ఇతర వివరాల కోసం 85003 09052 నంబర్‌లో సంప్రదించవచ్చు.శ్రీరంగాపురం, మంత్రాలయానికి ప్రత్యేక టూర్‌ ప్యాకేజీభక్తుల కోసం టీఎస్‌ఆర్టీసీ డిపో-1 మేనేజర్ వేణుగోపాల్ శ్రీరంగాపురం, మంత్రాలయానికి ప్రత్యేక టూర్‌ ప్యాకేజీని ప్రకటించారు. ఈ బస్సు సర్వీసు ఈ నెల 30న ఉదయం 5 గంటలకు ఎంజీబీఎస్ నుంచి బయలుదేరుతుంది. ఇది రెండు రోజుల యాత్ర కానుంది. శ్రీరంగాపురంలోని రంగనాయక దేవాలయం, బీచుపల్లిలోని ఆంజనేయస్వామి ఆలయం (కృష్ణా నది ఒడ్డున), ఐదో శక్తిపీఠంగా భావించే జోగులాంబ అమ్మవారి దేవస్థానం, తుంగభద్ర నది ఒడ్డున ఉన్న మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దేవాలయాలను ఈ ప్యాకేజీలో భాగంగా దర్శించుకోవచ్చు. ఈ టూర్‌లో భక్తులు దర్శనం చేసుకున్న తర్వాత మరుసటి రోజు సాయంత్రం 5 గంటలకు తిరిగి ఎంజీబీఎస్ చేరుకుంటారు. 36 సీట్ల సామర్థ్యం ఉన్న సూపర్‌ లగ్జరీ బస్సులో ఒక్కొక్కరికి రూ.1400 ఛార్జీగా నిర్ణయించారు. భక్తులు ఈ ప్రత్యేక సర్వీసు నంబరు 95585కు ఆన్‌లైన్‌లో ముందుగానే రిజర్వేషన్ చేయించుకోవాలని టీఎస్‌ఆర్టీసీ సూచించింది. ఈ ప్రత్యేక టూర్‌ ప్యాకేజీలు పర్యాటకులు, భక్తులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తాయి. భవిష్యత్తులో కూడా మరిన్ని టూర్‌ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకురావాలని టీఎస్‌ఆర్టీసీ యోచిస్తోంది.