ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ టెన్షన్ ఉండదు..!

Wait 5 sec.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే లబ్ధిదారులను ఎంపిక చేయగా.. ఇండ్ల నిర్మాణాలు కూడా చేపట్టారు. అయితే చాలా చోట్ల ఇంటి నిర్మాణానికి అవసరమైన ఇసుక కొరత ఏర్పడింది. కొన్ని చోట్ల అధిక ధరలకు ఇసుకను కొనాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఇసుక సమస్యలతో ఇబ్బందులు పడకుండా చూడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. సాండ్ బజార్ల ద్వారా ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక సరఫరా చేయాలని డిసైడ్ అయింది. జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన సాండ్‌ బజార్‌ను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి వేబ్రిడ్జి, ఇసుక క్వారీని రిబ్బన్ కట్ చేసి, పచ్చజెండా ఊపి ప్రారంభోత్సవం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నేరుగా ఇసుక అందుబాటులోకి తేవడం సంతోషంగా ఉందన్నారు. ఆందోల్ నియోజకవర్గ వ్యాప్తంగా 3,500 ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వం కేటాయించిందని అందులో మున్సిపాలిటీ పరిధిలో 125 ఇండ్లు మంజూరు కాగా.. ఇప్పటికే 112 ఇండ్ల నిర్మాణాలు ప్రారంభమై బేస్మెంట్ స్థాయికి చేరుకున్నాయని తెలిపారు. ఇండ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను ఒక్కో లబ్ధిదారునికి 40 మెట్రిక్ టన్నులు సబ్సిడీ ధరలో అందిస్తామని స్పష్టం చేశారు. మార్కెట్‌లో టన్ను ఇసుక ధర రూ.2,600 వరకు ఉండగా.. సాండ్ బజార్‌లో మాత్రం కేవలం రూ.1,200కే అందించడం వల్ల ఒక్కో లబ్ధిదారునికి రూ.50 వేల వరకు ఆదా అవుతుందని మంత్రి వివరించారు.ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన బిల్లుల చెల్లింపులో ఎలాంటి జాప్యం జరగడం లేదని, సకాలంలో మంజూరు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. లబ్ధిదారులు ఇసుక కోసం బయట తిరగాల్సిన అవసరం లేకుండా నేరుగా బజార్ వద్ద నుంచి సులభంగా పొందగలరని తెలిపారు. సాండ్‌ బజార్ నుంచి ఇసుకను బ్లాక్ మార్కెట్‌కు తరలించే యత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ప్రభుత్వం సబ్సిడీ ధరలో ఇసుక అందిస్తోందని... ఇది కేవలం లబ్ధిదారుల ప్రయోజనార్థమేనని చెప్పారు. దాన్ని వేరే దారిలో మళ్లించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటివరకు మంజూరు కాని అర్హులైన కుటుంబాలకు త్వరలోనే కొత్తగా ఇండ్ల కేటాయింపులు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.