విశాఖ వాసులకు ఎగిరి గంతేసే వార్త. విశాఖపట్నం వాసులకు, అలాగే సాగర తీరం విశాఖను సందర్శించేవారికి ఏపీ ప్రభుత్వం తీపికబురు వినిపించింది. విశాఖపట్నంలో త్వరలోనే డబుల్ డెక్కర్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా నాయుడు చేతుల మీదుగా ఆగస్ట్ 29వ తేదీన ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని విశాఖపట్నం కలెక్ట హరేంధిర ప్రసాద్ వెల్లడించారు. ఆగస్ట్ 29వ తేదీన విశాఖపట్నంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తారని కలెక్టర్ తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనపై కలెక్టర్ సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం పర్యటన వివరాలను అధికారులకు వివరించారు.ఆగస్ట్ 29వ తేదీ ఉదయం 11 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చంద్రబాబు చేరుకుంటారు. అనంతరం నోవాటెల్‌ వెళ్తారు. అక్కడ జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సందర్బంగా పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన డబుల్ డెక్కర్ బస్సులను చంద్రబాబు ప్రారంభిస్తారని కలెక్టర్ వెల్లడించారు. విశాఖపట్నంలో పర్యాటక రంగం అభివృద్ధి కోసం ఈ ఎలక్ట్రికల్ డబుల్ డెక్కర్ బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. సాగర తీరం అందాలను డబుల్ డెక్కర్ బస్సుల్లో అద్దాల మధ్యలో నుంచి చూస్తుంటే ఆ కిక్కే వేరప్పా అనేలా ఉంటుంది. అలాంటి థ్రిల్‌ను సందర్శకులకు అందించాలనే ఉద్దేశంతో ఈ ఎలక్ట్రికల్ డబుల్ డెక్కర్ బస్సులు ఏర్పాటు చేస్తు్న్నారు. ఈ హాప్‌ ఆన్‌ హాప్‌ ఆఫ్‌ బస్సులు సాధారణంగా ఐరోపా దేశాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. అయితే పర్యాటకులకు భిన్నమైన అనుభవాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ డబుల్ డెక్కర్ బస్సులను విశాఖలో తీసుకువస్తున్నారు. కైలాసగిరి, బీచ్ రోడ్డు, తొట్లకొండ, భీమిలి బీచ్, ఎర్రమట్టి దిబ్బలు వంటి ప్రాంతాల మీదుగా నడిపేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం మూడు లేదా నాలుగు బస్సులు నడపనున్నట్లు సమాచారం. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద రెండు బస్సులు అందించేందుకు విశాఖ పోర్టు అధికారులు ఇప్పటికే అంగీకారం తెలిపారు. అశోక్‌ లేలాండ్‌ ప్లాంట్‌ ప్రారంభం సందర్భంగా ఆ సంస్థ కూడా ఓ హాప్‌ ఆన్‌ హాప్‌ ఆఫ్‌ బస్సును ఉచితంగా అందజేసింది. మరో రెండు బస్సులను కొనుగోలు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. విశాఖ స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ వీటి నిర్వహణ బాధ్యతలు చూడనుంది. సాగర్‌నగర్‌ వద్ద ఈ ఎలక్ట్రికల్ బస్సుల ఛార్జింగ్‌ స్టేషన్, పార్కింగ్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ బస్సులలో పర్యాటక సంస్థల వివరాలు తెలియజేసేందుకు గైడ్లు కూడా అందుబాటులో ఉంటారు. ఆర్కే బీచ్, కైలాసగిరి, రుషికొండ, తొట్లకొండ, భీమిలి బీచ్‌ వరకూ వీటిని నడపాలని ప్రాథమికంగా నిర్ణయించారు.