ITR Refund: మీరు మీ ఐటీఆర్ ఫైల్ చేసి రీఫండ్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే రీఫండ్ జారీ చేయాల్సిందనికి బదులుగా మీకు ఐటీ విభాగం నోటీసులు పంపించిందా? అయితే మీకో అలర్ట్. చాలా మంది ట్యాక్స్ పేయర్లకు ఇలాగే రీఫండ్ జారీకి ముందు నోటీసులు వస్తున్నాయి? ఇలా మీకు కూడా వచ్చిందంటే ఆందోళన చెందకుండా ఆ నోటీసులో ఉన్న విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. సాధారణంగా ఇన్‌కమ్ ట్యాక్స్ రీఫండ్ అడ్జెస్ట్‌మెంట్ నోటీసు పంపిస్తుంటారు. గతంలోని ట్యాక్స్ డిమాండ్లను భర్తీ చేసేందుకు ఈ నోటీసులు ఇస్తుంటారు. అలా మీకు కూడా వస్తే దానికి వెంటనే స్పందించాల్సి ఉంటుంది. అయితే, చాలా కేసుల్లో శాఖ మీ పాత పన్ను బకాయిలను ప్రస్తుతం ట్యాక్స్ రీఫండ్స్‌తో భర్తీ చేయాలని అనుకుంటున్నట్లు నోటీసు ద్వారా తెలియజేస్తుంది. అయితే, ఇలా నోటీసులు వచ్చినప్పుడు అందుకు తగిన విధంగా ఎలా స్పందించాలో తెలుసుకోవాలి. ఇచ్చిన గడువులోపు తమ స్పందన తెలియజేయాలి. ఇలా చేస్తే భవిష్యత్తులో ట్యాక్స్ చిక్కులు ఎదురుకాకుండా చూసుకోవచ్చు. ఆదాయపు పన్ను రీఫండ్ సర్దుబాటు నోటీసులు వస్తే ఏం చేయాలో తెలుసుకుందాం. పన్ను నిపుణుల ప్రకారం వచ్చి నోటీసును పూర్తిగా అర్థం చేసుకోవాలి. రీఫండ్ సర్దుబాటుకు గల కారణాన్ని తెలుసుకోవాలి. గతంలోని పన్ను బకాయిలను సర్దుబాటు చేస్తుంటారు. ట్యాక్స్ పేయర్లు 21-30 రోజుల్లోగా రిప్లై ఇవ్వాలి. తాము ట్యాక్స్ బకాయిల సర్దుబాటుకు అంగీకరిస్తున్నామని లేదా వ్యతిరేకిస్తున్నామని చెప్పాలి. ట్యాక్స్ బకాయిలు లేనట్లయితే అందుకు తగిన డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. ఇన్‌కమ్ ట్యాక్స్ ఇ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా రిప్లై ఇవ్వాలి. దానిని పరిశీలించిన తర్వాత మళ్లీ రీఫండ్ ఎంత జారీ చేయాలనేది నిర్ణయం తీసుకుంటారు. సరైన కారణం తెలిపినట్లయితే మీకు రీఫండ్ మొత్తం వస్తుంది. లేదంటే పాత బకాయిలతో సర్దుబాటు చేస్తుంటారు. ఈ మేరకు ట్యాక్స్ పేయర్లకు ఔట్‌స్టాండింగ్ ట్యాక్స్ లయబిలిటీని అడ్జెస్ట్ చేయాలనుకుంటున్నట్లు నోటీసులు పంపిస్తారు. ఈ నోటీసులు వస్తే గత సంవత్సరానికి సంబంధించిన పన్ను బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, తమకు అలాంటి బకాయిలు లేవనుకుంటే ప్రూఫ్స్ చూపించాల్సి ఉంటుంది. అన్ని డాక్యుమెంట్లు సమర్పించగలగితే ఐటీ శాఖ తుది నిర్ణయం తీసుకుంటుంది.