వినాయక చవితి సందర్భంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు గణేషుడి విగ్రహాలు, మండపాలు అంగరంగ వైభవంగా ముస్తాబు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ వినాయకుడు, ముంబైలోని జీఎస్‌బీ సేవా మండల్ గణపతి సహా దేశవ్యాప్తంగా కొన్ని విగ్రహాలు మాత్రమే ప్రతీసారి వార్తల్లో నిలుస్తూ ఉంటాయి. అయితే దేశంలోనే అత్యంత ఎత్తైన వినాయకుడి విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి ఏర్పాటు చేశారు. ఏకంగా 126 అడుగుల ఎత్తు ఉన్న భారీ శ్రీ లక్ష్మీ గణపతి విగ్రహాన్ని.. అనకాపల్లి జిల్లాలో నిలబెట్టారు. ఈ విగ్రహాన్ని పూర్తిగా మట్టితోనే తయారు చేయడం విశేషం. 45 మంది కార్మికులు.. దాదాపు రెండు నెలలు కష్టపడి.. ఈ భారీ వినాయకుడి విగ్రహాన్ని రూపొందించారు. అయితే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా దీన్ని నిర్మించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఇక ఈ అతిపెద్ద మట్టి వినాయకుడిని.. అనకాపల్లికి చెందిన ప్రముఖ శిల్పి కామదేను ప్రసాద్ పర్యవేక్షణలో నిర్మాణం చేశారు. 45 మంది కార్మికులు.. దాదాపు 50 రోజుల పాటు శ్రమించి తయారు చేశారు. ఇక ఈ 126 అడుగుల భారీ గణనాథుడి విగ్రహాన్ని తయారు చేసేందుకు 10 టన్నుల బంక మట్టిని ఉపయోగించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. బుధవారం రోజున ప్రారంభమైన నవరాత్రోత్సవాలు వచ్చే నెల 23వ తేదీ వరకు జరగనున్నట్లు తెలిపారు. దాదాపు నెల రోజుల వ్యవధి ఉండగా.. ఈ కాలంలో రోజుకు ఒక సాంస్కృతిక కార్యక్రమంతోపాటు.. ఆధ్యాత్మిక పోటీలను నిర్వహించనున్నారు. ఇక ఎత్తైన, భారీ లంబోదరుడిని చూసి.. దర్శించుకునేందుకు భక్తులు భారీ ఎత్తున తరలివస్తున్నారు. అనకాపల్లిలోని ఎన్టీఆర్‌ క్రీడా మైదానం వద్ద సంపత్ వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు ఈ 126 అడుగుల మట్టి గణపతిని ఏర్పాటు చేశారు. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్ వరల్డ్‌లో స్థానం పొందడమే లక్ష్యంగా ఈ భారీ గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు సంపత్ వినాయక కమిటీ అధ్యక్షుడు బుద్ధ భూలోక నాయుడు వెల్లడించారు. ఈ విగ్రహం తయారీ కోసం 10 టన్నుల మట్టి.. మండలం ఏర్పాటు చేసేందుకు 90 టన్నుల సరుగుడు బాదులు ఉపయోగించినట్లు తెలిపారు. ఇక ఈ 126 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని తయారు చేసేందుకు సుమారు రూ.70 లక్షలు ఖర్చు అయినట్లు పేర్కొన్నారు. నిత్యం ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు.. మధ్యాహ్నం 1 గంటల నుంచి 3 గంటల వరకు ఈ ఎత్తైన వినాయకుడి విగ్రహాన్ని దర్శించుకునేందుకు భక్తులకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. మిగిలిన సమయాల్లో హోమాలు, అభిషేకాలు నిర్వహిస్తామని.. ఒకవేళ అందులో పాల్గొనేందుకు టికెట్‌ తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. సెప్టెంబరు 22వ తేదీన అన్నసమారాధన నిర్వహించి.. ఆ తర్వాతి రోజు అంటే 23వ తేదీన నిమజ్జన కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు.