GST On Bikes: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) సంస్కరణలకు శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం. జీఎస్టీలో ప్రస్తుతం ఉన్న పన్ను శ్లాబులను తగ్గించి రెండు మాత్రమే అమలు చేస్తామని తెలిపింది. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆమోదం లభిస్తే అమలులోకి వస్తాయి. నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించి పన్ను భారాన్ని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే, జీఎస్టీ సంస్కరణల కారణంగా లగ్జరీ బైక్స్ కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి బ్యాడ్‌న్యూస్ అని చెప్పాలి. ద్విచక్రవాహనాల ఇంజిన్ సామర్థ్యం 350సీసీ ఆపైన ఉంటే జీఎస్టీ బాదుడు ఉండనుంది. 350 సీసీ ఆపైన ఉండే లగ్జరీ బైక్స్‌ను కొత్త పన్ను శ్లాబు 40 శాతంలోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తోందటా. ఇదే జరిగితే ప్రస్తుతం 28 శాతం శ్లాబులో ఉన్న బైక్స్ 40 శాతంలోకి వెళ్తాయి. దీంతో ఈ ద్విచక్ర వాహనాల ధరలు అమాంతం పెరుగుతాయి. దాదాపు 12 శాతం అదనపు జీఎస్టీ చెల్లించాల్సి వస్తుంది. అయితే, 350సీసీ లోపు ఉండే చిన్న బైకులు, స్కూటర్ల ధరలు దిగిరానున్నాయి. వీటిని 28 నుంచి 18 శాతం పన్ను శ్లాబులోకి తీసుకొస్తారని సమాచారం. అదే జరిగితే జీఎస్టీ 10 శాతం మేర తగ్గిపోతుంది. దీంతో బైక్ ధరలు దిగివస్తాయి. ఇందులో నాలుగు పన్ను శ్లాబులు 5, 12, 18, 28 శాతం ఉన్నాయి. అయితే, జీఎస్టీ పన్నుల ప్రక్రియను సులభతరం చేసి సామాన్య ప్రజలపై భారాన్ని తగ్గించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 12, 28 పన్ను శ్లాబులను తొలగించాలని ప్రతిపాదించింది. ఈ మేరకు స్వాతంత్య్ర దినోత్సవం రోజునే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. దీపావళి నాటికి జీఎస్టీ కానుక అందిస్తామన్నారు. అయితే, దసరాలోపే అమలులోకి తీసుకొచ్చి పండగ సీజన్ గిరాకీని పెంచాలని భావిస్తున్నట్లు సమాచారం. 12, 28 శ్లాబులను తొలగిస్తే ఇక 5, 18 శ్లాబులు మాత్రమే ఉంటాయి. 28 శాతంలో ఉన్న చాలా వస్తువులు 18 శాతానికి తగ్గుతాయి. దీంతో ధరలు ఒక్కసారిగా దిగివస్తాయి. అయితే, కొత్తగా 40 శాతం శ్లాబు తీసుకురావాలని కేంద్రం ప్రతిపాదించింది. మత్తు పదార్థాల వంటి సైన్ గూడ్స్, లగ్జరీ వస్తువులు, ప్రీమియం కార్లు, మోటర్ సైకిళ్లు ఈ గరిష్ఠ శ్లాబులోకి వెళ్తాయి. అంటే 350సీసీ దాటిన బైకులు లగ్జరీ శ్లాబులోకి వెళ్లిపోతాయి. దీంతో ధరలు ఒక్కసారిగా పెరుగుతాయి. అయితే, జీఎస్టీ శ్లాబుల మార్పులపై కౌన్సిల్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీనికి మరింత సమయం పడుతుందని చెప్పవచ్చు.