భారత నౌకాదళంలోకి రెండు చేరాయి. నీల్‌గిరి క్లాస్ యుద్ధ నౌకలు , ఐఎన్ఎస్ ఉదయగిరిలను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జాతికి అంకితం చేశారు. ఒకేసారి రెండు భారీ యుద్ధ నౌకలు జలప్రవేశం చేయడం భారత నౌకాదళ చరిత్రలో ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ ఏడాది జనవరిలో ఐఎన్ఎస్ నీల్‌గిరి నేవీలో చేరిన విషయం తెలిసిందే. ఐఎన్ఎస్ హిమగిరి, ఉదయగిరి యుద్ధ నౌకలను రెండు వేర్వేరు షిప్ యార్డులో నిర్మించారు. కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్‌లో ఐఎన్ఎస్ హిమగిరి, ముంబయిలోని మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్‌లో నిర్మాణం జరిగింది. కానీ, రెండూ ఒకే సమయంలో పూర్తికావడం చెప్పుకోదగ్గ అంశం. యుద్ద నౌకల డిజైన్, స్టెల్త్, ఆయుధాలు, సెన్సార్ వ్యవస్థను అత్యాధునిక సాంకేతికతతో రూపొందించారు. ఈ నీల్‌గిరి క్లాస్ యుద్ధ నౌకల తయారీలో 75 శాతం స్వదేశీ పరిజ్ఞానం వినియోగించారు. ఇది కేంద్రంలోని మోదీ ప్రభుత్వ చేపట్టిన మేకిన్ ఇండియా కార్యక్రమానికి ఊతమిస్తోంది. అయితే, దేశీయ పారిశ్రామిక-సాంకేతిక సామర్థ్యం, స్వదేశీ పరిజ్ఞానంతో ప్రాంతీయ శక్తి సమతౌల్యతను ప్రదర్శించే మూడు యుద్ధ నౌకల స్క్వాడ్రన్‌ను ఇండియన్ నేవీ కలిగి ఉంది. హిమగిరి, ఉదయగిరి చేరికతో నౌకాదళం పోరాట సంసిద్ధత మరింత పెరుగుతుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. భారతీయ షిప్‌యార్డ్‌లు అనుసరించిన మాడ్యులర్ నిర్మాణ విధానం ఫలితంగా ఈ తరగతిలో పరీక్షించిన తర్వాత జాతికి అంకితం చేసిన వేగవంతమైన ఓడగా ఉదయగిరి ఘనత సాధించింది. ఐఎన్ఎస్ ఉదయగిరి, హిమగిరిలను నేవీ వార్‌షిప్ డిజైన్ బ్యూరోనే డిజైన్ చేసింది. ఈ క్రమంలో వార్‌షిప్ డిజైన్ బ్యూరో రూపొందించిన 100వ యుద్ధ నౌకగా ఉదయగిరి నిలిచింది. ఇటీవలే నౌకదళం నుంచి సేవలను ఉపసంహరించి, 30 ఏళ్లకు పైగా దేశానికి విశిష్ట సేవలందించిన యుద్ద నౌకల పేరునే వీటికి పెట్టారు. కమిషన్డ్ తర్వాత, రెండు యుద్ధనౌకలు తూర్పు నౌకాదళంలో చేరతాయి.. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని దేశ ప్రయోజనాలను కాపాడుకునే సామర్థ్యాన్ని ఇవి బలోపేతం చేస్తాయి. ఒక్కొక్కటి దాదాపు 6,700 టన్నుల బరువుతో మునుపటి శివాలిక్-క్లాస్ యుద్ధ నౌకల కంటే దాదాపు ఐదు శాతం పెద్దవి. వాటి ఆకారం, రాడార్ క్రాస్-సెక్షన్‌ను మాత్రం తగ్గించారు ఐఎన్ఎస్ ఉదయగిరిముంబయిలోని మజగావ్ డాక్స్ షిప్‌బిల్డర్స్ తయారుచేసిన ఐఎన్ఎస్ ఉదయగిరి పొడవు 149 మీటర్లు. దీని వేగం గంటకు 28 నాటికల్ మైళ్లు (గంటకు 52 కిలోమీటర్లు). ఇందులో 48 బరాక్-8 క్షిపణులు, 8 బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్షిపణులు సహా పలు ఆయుధాలు ఉంటాయి. దీనిపై నుంచి ఒకేసారి రెండు హెలికాప్టర్లను ఆపరేట్ చేయొచ్చు. డీజిల్ ఇంజిన్లు, గ్యాస్ టర్బైన్ల ద్వారా శక్తిని పొంది నియంత్రించదగిన-పిచ్ ప్రొపెల్లర్లను నడుపుతాయి. ఇంటిగ్రేటెడ్ మేనేజ్‌మెంట్ ఇంటర్‌ఫేస్ ద్వారా నిర్వహణ సాగుతుంది.