తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది. బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ చర్యలు చేపట్టారు. ఈ మేరకు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి సహా ఐదుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు అందాయి.బీఆర్‌ఎస్‌ గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, ఇతర ఎమ్మెల్యేలు, బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వేర్వేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. జస్టిస్‌ బీఆర్‌ గవాయ్, జస్టిస్‌ ఆగస్టీన్‌ జార్జ్‌ మసీహ్‌ ధర్మాసనం ఈ పిటిషన్లపై జూలై 31న తుది తీర్పు వెలువరించింది. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల అనర్హతపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేసింది. విచారణకు ప్రభుత్వంలో ఉన్నవారు ఎవరూ ఆటంకాలు కలిగించరాదని, సాకులు చెప్పి విచారణను వాయిదా వేస్తే అది రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లే అవుతుందని కోర్టు స్పష్టం చేసింది. ఎమ్మెల్యేలందరూ ఏదో ఒక రోజు అనర్హత విచారణను ఎదుర్కోవాల్సిందేనని వ్యాఖ్యానించింది.సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ ఇచ్చిన ఫిర్యాదులపై వివరణ ఇవ్వాలని కోరుతూ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై స్పందించిన కృష్ణమోహన్‌ రెడ్డి.. తనకు నోటీసులు అందిన విషయాన్ని ధృవీకరించారు. అయితే, తాను పార్టీ మారలేదని, కాంగ్రెస్‌లోకి వెళ్లలేదని స్పష్టం చేశారు. గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశానని, తాను ఇప్పటికీ బీఆర్‌ఎస్‌ పార్టీలోనే కొనసాగుతున్నానని తెలిపారు. తన తరఫు న్యాయవాదుల ద్వారా త్వరలోనే నోటీసులకు సమాధానం ఇస్తానని చెప్పారు.ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత స్పీకర్‌ చర్యలు ప్రారంభించడంతో ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.