Anil Ambani : దేశంలోని దిగ్గజ వ్యాపారవేత్త, రిలయన్స్ అనిల్ ధీరూబాయ్ అంబానీ గ్రూప్ అధినేత అనిల్ అంబానీకి మరో బిగ్ షాక్ తగిలింది. కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) శనివారం రోజు ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. రిలయన్స్ గ్రూప్‌కు చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (RCom) కార్యాలయాలు, ప్రమోటర్ అనిల్ అంబానీ ఇళ్లపై తనిఖీలు నిర్వహించింది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలు.. పలు బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో లోన్లు తీసుకొని అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ బ్యాంక్ లోన్ ఫ్రాడ్ కేసుకు సంబంధించే సీబీఐ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల నుంచి ఇదే కేసుకు సంబంధించి.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం రూ. 17 వేల కోట్ల విలువైన ఈ బ్యాంక్ లోన్ ఫ్రాడ్ కేసుకు సంబంధించి అంతకుముందు అనిల్ అంబానీకి చెందిన డజన్ల కొద్దీ తనీఖీలు నిర్వహించిన . ఇందులో భాగంగానే.. ఆగస్ట్ 5న స్వయంగా అనిల్ అంబానీని దాదాపు 10 గంటల పాటు విచారించింది కూడా. పీఎంఎల్ఏ కింద ఆయన వాంగ్మూలం కూడా నమోదు చేసింది. జులై 24న ఈ రిలయన్స్ గ్రూప్‌కు చెందిన దాదాపు 50 కంపెనీలు ఉండే 35 ప్రాంతాల్లో, 25 మంది వ్యక్తులపైనా ఈడీ పెద్ద ఎత్తున సోదాలు చేసి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. అంబానీ సహా రిలయన్స్ గ్రూప్‌కు చెందిన పలువురు సీనయిర్ ఎగ్జిక్యూటివ్‌లకు కూడా సమన్లు జారీ చేసింది ఈడీ. ఇదే సమయంలో అనిల్ అంబానీకి విచారణకు రావాల్సిందిన నోటీసులు అందజేసిన ఈడీ.. చేసింది. మొత్తం రూ. 17 వేల కోట్ల రుణాల్లో.. రిలయన్స్ హోం ఫైనాన్స్ రూ. 5900 కోట్లకుపైగా; రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ సుమారు రూ. 8200 కోట్లు, రిలయన్స్ కమ్యూనికేషన్స్ రూ. 4100 కోట్లకుపైగా ఉన్నాయి. ఇక వీటిని బ్యాంకుల నుంచి అక్రమమార్గంలో కొందరు బ్యాంక్ అధికారులకు లంచం ఇచ్చి తీసుకున్నారని.. ఇంకా వీటిని ఇతర షెల్ కంపెనీలకు మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక అప్పటి నుంచి ఈడీ నోటీసులు, విచారణ నేపథ్యంలో రిలయన్స్ గ్రూప్‌కు చెందిన రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇలా పలు కంపెనీల స్టాక్స్ కూడా భారీగా పడిపోయాయి.