రానున్న 24 గంటల్లో అల్పపీడనం.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

Wait 5 sec.

తెలంగాణకు అధికారులు మరోసారి వర్షం హెచ్చరికలు జారీ చేశారు. నేడు, రేపు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం రానున్న కొన్ని గంటల్లో బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందన్నారు. ఈ అల్పపీడనం ప్రభావంతో తూర్పు గాలులు బలపడి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. రుతుపవన ద్రోణి ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ మీదుగా కొనసాగుతోందని వెల్లడించారు. ఈ ద్రోణి వల్ల వర్షాలు మరింత పెరుగుతాయన్నారు. నేడు ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా భద్రాచలం, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ వంటి ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉందని.. వాగులు, వంకలు పొంగిపొర్లే ఛాన్స్ ఉన్నందున ప్రజలు ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలోని 10 జిల్లాల్లో నిర్మల్ జిల్లాలో అత్యధికంగా 44 శాతం లోటు ఉండగా.. పెద్దపల్లిలో 21 శాతం, జయశంకర్ భూపాలపల్లిలో 13, నల్గొండలో 13, నిజామాబాద్‌లో 12, జగిత్యాలలో 12, రాజన్న సిరిసిల్లలో 11, మంచిర్యాలలో 10, సంగారెడ్డిలో 6, మేడ్చల్ మల్కాజిగిరిలో 4 లోటు నమోదైంది. ఈ వర్షాల వల్ల ఈ జిల్లాల్లోని లోటు కొంతమేర తగ్గే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో వర్షపాతం లోటు ఎక్కువగా ఉండటం వల్ల ఆయా ప్రాంతాల్లోని పంటలకు ఇబ్బందులు తప్పటం లేదు.. రానున్న వర్షాలు ఈ లోటును కొంతమేర భర్తీ చేయవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.