విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వెళ్లే భక్తులకు ముఖ్యమైన గమనిక. ఇకపై ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులకు కొత్త డ్రెస్‌కోడ్‌ అమల్లోకి రాబోతోందని ఈవో శీనా నాయక్ అధికారిక ప్రకటన చేశారు. భక్తులు సంప్రదాయ దుస్తుల్లో రావాల్సిందేనని.. ఒకవేళ అభ్యంతరకర దుస్తులలో వస్తే వారిని ఆలయంలోకి అనుమతి ఉండదన్నారు. భక్తులు మాత్రమే కాదు ఆలయ సిబ్బందికి డ్రెస్‌కోడ్‌ తప్పనిసరి చేశారు.. వారు కూడా సంప్రదాయ దుస్తు ధరించాల్సిందేనన్నారు. ఈ నెల 27 నుంచి డ్రెస్ కోడ్ అమల్లోకి వస్తుందన్నారు. మరోవైపు విజయవాడ దుర్గమ్మ ఆలయ ప్రాంగణంలోకి మొబైల్స్ కూడా అనుమతించరు. విధి నిర్వహణలో ఉండే సిబ్బంది మొబైల్స్ వాడటంపై నిషేధం విధించారు. భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించకపోవడంతో పాటుగా కొందరు అంతరాలయంలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసిన ఘటనలు ఉన్నాయట. ఈ క్రమంలో అధికారులు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆలయ సంప్రదాయాలను గౌరవించాలనే ఈ నిబంధనలు అమలు చేయలని నిర్ణయించారట.మరోవైపు ప్రోటోకాల్ దర్శనాలకు వచ్చే భక్తులు వారి మొబైల్స్‌ను ఆలయంలోని ఆఫీస్‌లో డిపాజిట్ చేయాలని సూచించారు. అంతేకాదు దుర్గమ్మ ఆలయంలో సిబ్బంది కచ్చితంగా ఐడీ కార్డులు ధరించాలని సూచించారు. స్కానింగ్ పాయింట్, టికెట్ కౌంటర్ దగ్గర తనీఖీలను ముమ్మరం చేశారు. కాబట్టి డ్రెస్ కోడ్, మొబైల్ తీసుకొచ్చేవారిపై నిఘా ఉంటుందని.. ఒకవేళ ఎవరైనా డ్రెస్ కోడ్ లేకుండా, మొబైల్ తీసుకుని వస్తే ఆలయంలోకి అనుమతి ఉండదని తెలిపారు అధికారులు. భక్తులు ఈ విషయాన్ని గమనించి తమకు సహకరించాలని కోరారు. పురుషులు అయితే దోవతి, పైజామా లాల్చీలు ధరించాల్సి ఉంటుంది. అదే మహిళలు చీర, చున్నీలతో కూడిన పంజాబీ డ్రస్సును అనుమతిస్తారు. చంద్ర గ్రహణం కారణంగా ఆలయాన్ని సెప్టెంబర్ 7న మధ్యాహ్నం 3.30 గంటల నుండి మూసివేయనున్నారు. దేవస్థానం ఈవో వి.కె.శీనానాయక్ ఈ విషయాన్ని తెలిపారు. గ్రహణం తరువాత, సెప్టెంబర్ 8న ఉదయం 8.30 గంటలకు తిరిగి దర్శనాలు ప్రారంభమవుతాయి. సెప్టెంబర్ 7న మధ్యాహ్నం 3.30 గంటలకు ఇంద్రకీలాద్రిపై ఉన్న ప్రధాన ఆలయం, ఉపాలయాలు మూసివేయబడతాయి. వైదిక కమిటీ కవాట బంధనం (తలుపులు మూసివేసే ప్రక్రియ) చేస్తుందని ఈవో తెలిపారు.