అమెరికాపై భారత్ తొలి కౌంటర్‌కు సిద్దమయ్యింది. ఇందులో భాగంగా యునైటెడ్ కింగ్‌డమ్, జపాన్, దక్షిణ కొరియాతో సహా 40 కీలక దేశాలకు వస్త్ర ఎగుమతులను పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రకటించినట్టు బుధవారం ఒక అధికారి తెలిపారు. ఈ జాబితాలో జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, నెదర్లాండ్స్, పొలెండ్, కెనడా, మెక్సికో, రష్యా, బెల్జియం, టర్కీ, యూఏఈ, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు.‘ఈ 40 దేశాలలో భారతీయ మిషన్లు సహా భారత పరిశ్రమలు నాణ్యమైన, స్థిరమైన, వినూత్న వస్త్ర ఉత్పత్తులకు నమ్మకమైన సరఫరాదారుగా తమను తాను నిలబెట్టుకుంటూ, లక్ష్య విధానాన్ని అనుసరించడానికి దీనిని ప్రతిపాదించారు’ అని అధికారి పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్‌లు (EPC), భారతీయ మిషన్‌లు ప్రధాన పాత్ర పోషిస్తూ భారత‌ను స్థిరమైన, వినూత్న వస్త్ర ఉత్పత్తుల నమ్మకమైన సరఫరాదారుగా ఉంచడం ఈ ప్రణాళిక లక్ష్యం అని అధికారులు చెప్పారు. బుదవారం (ఆగస్టు 27) నుంచి భారతీయ వస్త్రాలు, రత్నాలు, ఆభరణాలు, రొయ్యలు, లెదర్, పాదరక్షలు, రసాయనాలు, యంత్రాలు వంటి ప్రధాన రంగాలను ప్రభావితం చేయనున్నాయి. ప్రస్తుతం 220కిపైగా దేశాలకు భారత్ ఎగుమతులు చేస్తోంది.. కానీ, అధికారికంగా యూకే, జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా సహా 40 దేశాల మార్కెట్లను ఎంపిక చేసింది. ఈ దేశాలు ఏటా మొత్తం 590 బిలియన్ డాలర్లకుపైగా విలువైన వస్త్రాలు, దుస్తులను దిగుమతి చేసుకుంటాయి. దీని వల్ల భారత్ తన మార్కెట్ వాటాను పెంచుకోవడానికి విస్తృత అవకాశాలు లభిస్తాయని, ప్రస్తుతం ఇది 5-6 శాతంగా మాత్రమే ఉందని ఆ అధికారి తెలిపారు. ‘‘దీనిని గుర్తించిన ప్రభుత్వం.. ఈ 40 దేశాలలో ప్రతిదానిలో సాంప్రదాయ, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లపై దృష్టి సారించి, ప్రత్యేక కార్యాచరణకు ప్లాన్ చేస్తోంది’’ అని ఆయన అన్నారు. ఇందులో ఈపీసీ కీలక పాత్ర పోషించనుందని ఆ అధికారి పేర్కొన్నారు. ఈపీసీ మార్కెట్ మ్యాపింగ్ నిర్వహించి, అధిక డిమాండ్ ఉన్న ఉత్పత్తులను గుర్తిస్తుంది. అనంతరం సూరత్, పానిపట్, తిరుపూర్, భదోహి వంటి ప్రత్యేక క్లస్టర్‌లను టాప్ 40 దేశాలలోని అవకాశాలతో అనుసంధానం చేస్తుంది. ఇక, అలాగే, ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిళ్లు అంతర్జాతీయ వాణిజ్య ఫెయిర్లు, ప్రదర్శనలు, బయ్యర్-సెల్లర్ మీట్స్ వంటి వేదికలలో భారత పరిశ్రమ ఉనికి బలోపేతం చేయడంతో పాటు ఏకీకృత బ్రాండ్ ఇండియా గుర్తింపుతో రంగాల వారీగా ప్రత్యేక ప్రచారాలను నిర్వహిస్తాయి. అదనంగా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ (FTAs) వినియోగం, గ్లోబల్ సస్టైనబిలిటీ ప్రమాణాలు పాటించడం, అవసరమైన సర్టిఫికేషన్లు పొందడం వంటి అంశాలలొ ఎగుమతిదారులకు మార్గనిర్దేశం చేస్తాయి. ఇదిలా ఉండగా, టారిఫ్‌ల యుద్ధం ఇరు దేశాల ఆర్ధిక వ్యవస్థకు నష్టం కలిగిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.