బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

Wait 5 sec.

ఏపీని వర్షాలు ముంచెత్తాయి.. ఒడిశా తీరంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. రాబోయే 24 గంటల్లో ఇది పశ్చిమ-వాయువ్య దిశగా ఒడిశా,ఛత్తీస్‌గఢ్ వైపు కదిలే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. తీరం వెంబడి గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. ఇవాళ అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే పార్వతీపురం మన్యం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో 77 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కోనసీమ జిల్లా మలికిపురంలో 74.5 మిల్లీమీటర్లు, భీమవరంలో 67.5 మిల్లీమీటర్లు, విజయవాడ పశ్చిమలో 62.5 మిల్లీమీటర్లు, విజయవాడ సెంట్రల్‌లో 62 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు పేర్కొన్నారు. ఎగువ రాష్ట్రాల్లో . దీంతో కృష్ణా, గోదావరి, తుంగభద్ర నదుల్లో నీటిమట్టం పెరుగుతోంది. నదులు పొంగిపొర్లే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. వినాయక నిమజ్జనాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. నదులు, కాలువలు, వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. స్నానాలు కూడా చేయకూడదని సూచిస్తున్నారు. వినాయక మండపాల నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. నిమజ్జనాల సమయంలో నదులు, కాలువల వద్ద హెచ్చరిక బోర్డులను గమనించాలి. అధికారులకు సహకరించాలని ప్రఖర్ జైన్ కోరారు. ప్రజలు అత్యవసర సహాయం కోసం టోల్ ఫ్రీ 112, 1070, 18004250101 సంప్రదించాలని సూచించారు. ముఖ్యంగా రాష్ట్రంలో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు అధికారులు.