ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. వచ్చే నెల మొదటి వారంలో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1,120 కోట్లు పంచాయతీలకు విడుదల చేస్తామని తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారని.. అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధుల విడుదల వల్ల రాష్ట్రంలోని పంచాయతీలకు, సర్పంచ్‌లకు ఊరట దక్కనుంది. ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులను సద్వినియోగం చేస్తుందని.. స్థానిక స్వపరిపాలనను బలోపేతం చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం అన్నారు. గ్రామ స్థాయిలో కనీస వసతులు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని.. రాష్ట్రానికి నిధులు విడుదల చేసినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వం ఈ నిధులను ఇతర పథకాలకు మళ్లించిందని విమర్శించారు . రాష్ట్రంలోని పంచాయతీల అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా సహాయం చేస్తోంది. పంచాయతీలకు నిధుల విడుదల గురించి ఈ నెల 15న పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయాన్ని సర్పంచులు సంప్రదించారని.. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు పంచాయతీలకు విడుదల చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇప్పుడు ఆ హామీని నెరవేర్చబోతున్నామన్నారు.'శాసన మండలి సమావేశంలో గ్రామ పంచాయతీలకు ఉద్దేశించిన ఆర్థిక సంఘం గ్రాంట్లను ఇకపై వాటి ఉద్దేశించిన ప్రయోజనం కోసం మాత్రమే వినియోగించేలా ప్రభుత్వం చూస్తుందని నేను సభకు హామీ ఇచ్చాను. గత ప్రభుత్వం అటువంటి నిధులను ఇతర పథకాలకు మళ్లించింది. ఈ రీతిలో నిధులను మళ్లించేయడం వల్ల స్థానిక సంస్థలపై ఆర్థిక భారం ఏర్పడింది. గ్రామాల అభివృద్ధి కుంటుపడింది. జీతాల చెల్లింపులలో జాప్యం కూడా జరిగింది' అన్నారు .'రాష్ట్రానికి కేంద్ర ఆర్థిక సంఘం నిధులను సకాలంలో విడుదల చేసినందుకు గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. రాష్ట్రంలో పంచాయతీల అభివృద్ధికి అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోంది. కమిషనర్, పంచాయతీరాజ్ కార్యాలయాన్ని ఈ నిధుల అంశంపై ఆగస్టు 5న సర్పంచ్‌లు సంప్రదించారు. పెండింగ్‌లో ఉన్న 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1,120 కోట్లను సెప్టెంబర్ మొదటి వారంనాటికి అన్ని పంచాయతీలకు విడుదల చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. వారికి నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. స్థానిక పాలనకు సాధికారత కల్పించాలనే ముఖ్యమంత్రి గారి నిబద్ధత ఈ హామీ ద్వారా తెలుస్తోంది. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం... బాధ్యతాయుతమైన, ప్రజా-కేంద్రీకృత నాయకత్వానికి ఉదాహరణగా నిలుస్తుంది' అన్నారు.'ఆర్థిక సంఘం నిధుల విడుదల మూలంగా రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్‌లకీ, స్థానిక సంస్థలకు గొప్ప ఉపశమనం కలుగుతుంది. సభలో హామీ ఇచ్చినట్లుగానే- ఆర్థిక సంఘం నిధులను పంచాయతీలకు మాత్రమే ఉపయోగిస్తూ, వాటిని సద్వినియోగపరచాలనే దృఢమైన వైఖరిని మా ప్రభుత్వం తీసుకుంది. స్థానిక స్వపరిపాలనను బలోపేతం చేస్తూ, గ్రామ స్థాయిలో కనీస మౌలిక వసతులు, సేవలు సమర్థంగా అందించాలన్నదే మా ఉద్దేశం. గ్రామ పంచాయతీలను శక్తివంతంగా చేయాలని సంకల్పించాము' అని తెలిపారు.