ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో సోమవారం అర్ధరాత్రి తర్వాత అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతోందని.. ఇది బుధవారం నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది రానున్న రెండు రోజుల్లో మరింత బలపడుతుందని భావిస్తున్నారు. ఈ ప్రభావంతో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడతాయని.. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయంటున్నారు. 'ఒడిశా తీరానికి ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది రాబోయే 2 రోజుల్లో పశ్చిమవాయువ్య దిశగా కదిలి మరింత బలపడే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో బుధవారం ఉత్తరాంధ్రలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 40-60కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. మంగళవారం సాయంత్రం 6 గంటల నాటికి అనకాపల్లి(D) సాలపువానిపాలెంలో60.2మిమీ, శ్రీకాకుళంలో 58మిమీ, 65 ప్రాంతాల్లో 40మిమీకు పైగా వర్షపాతం నమోదైంది. అత్యవసర సహాయం కోసం టోల్ ఫ్రీ 112, 1070, 18004250101 సంప్రదించండి. వినాయక మండపాల నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలి.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి' అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తుండంతో హోంమంత్రి అనిత పరిస్థితిని సమీక్షించారు. అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. సహాయక చర్యల కోసం NDRF, SDRF దళాలు సిద్ధంగా ఉండాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఉంటూ ప్రజలకు సహాయం చేయాలని ఆమె అధికారులకు సూచించారు. శ్రీకాకుళం జిల్లాలో మంగళవారం భారీ వర్షం కురిసింది. దీనితో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. చాలా మండలాల్లో పంట పొలాలు నీటిలో మునిగిపోయాయి. శ్రీకాకుళం నగరంలో సోమవారం రాత్రి నుండి మంగళవారం మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. శ్రీకాకుళం నగరంలో భారీ వర్షం కారణంగా చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. జిల్లా కేంద్రంలో 52.4 మి.మీ వర్షపాతం నమోదైంది. నగరంలోని పెద్దపాడు దగ్గర జాతీయ రహదారిపై నాలుగు అడుగుల లోతు నీరు నిలిచింది. సర్వీసు రోడ్డులో వాహనాలు తిరగడానికి వీలు లేకుండా పోయింది.