చెల్లి పెళ్లి.. తల్లికి కల్యాణలక్ష్మి చెక్కు అందించిన MLA, అధికారులు షాక్..!

Wait 5 sec.

ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు ఎంపీడీవో కార్యాలయం. కార్యక్రమం జరుగుతోంది. అధికారులు వరుస క్రమంలో లబ్ధిదారుల పేర్లను పిలుస్తున్నారు. 'గిరిజాబాయి' అనే పేరు పిలవగానే ఒక వృద్ధురాలు వేదిక వద్దకు వచ్చారు. ఆమెను చూసిన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు వెంటనే దగ్గరికి వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడున్న ప్రజలను, అధికారులను ఉద్దేశించి 'ఈమె ఎవరో మీకు తెలుసా?' అని ఎమ్మెల్యే వారిని ప్రశ్నించారు. ప్రజలు, అధికారులు సైతం ఆమెను గుర్తుపట్టలేకపోయారు. అందరి ముఖాల్లో ఆశ్చర్యం చూసి.. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు చిరునవ్వుతో 'ఈమె నా అమ్మ' అని పరిచయం చేశారు. అది విని అధికారులు షాక్ అయ్యారు. గతేడాది జరిపించగా.. ఆమె వివాహం కోసం ప్రభుత్వం మంజూరు చేసిన కల్యాణలక్ష్మి చెక్కును తన చేతుల మీదుగా తల్లి గిరిజాబాయికి అందించారు. ఈ అనూహ్య ఘటన అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచింది. తల్లీ, కొడుకులను ఇద్దరినీ చూసి అందరూ చప్పట్లు కొట్టి, నవ్వులు చిందించారు. కాగా, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు నిరాడంబరత, ప్రజలతో కలిసిపోయిన స్వభావంతో తరచుగా ప్రశంసలు పొందుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు మండలంలో ఒక పేద గిరిజన కుటుంబంలో జన్మించిన బొజ్జు.. అనేక కష్టాలను ఎదుర్కొంటూ ఎదిగారు. పేదల కష్టాలపై గళం విప్పుతూ వారి మన్ననలు పొందారు. ఈ క్రమంలోనే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అనుహ్యంగా కాంగ్రెస్ టికెట్ సాధించి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వారి కుటుంబం ఇప్పటికీ ఇందిరమ్మ ఇంట్లోనే నివాసం ఉంటోంది. కష్టం విలువ తెలిసిన బొజ్జు.. రాజకీయాల్లోకి వచ్చాక కూడా తన మూలాలను మర్చిపోలేదు. ఆయన నిరాడంబరత, పేదరికం నుంచి వచ్చిన అనుభవాలు ప్రజలకు మరింత చేరువయ్యేలా చేశాయి. తాజా సంఘటన ఆయన వ్యక్తిత్వాన్ని మరింత లోతుగా వెల్లడించింది. అధికారం వచ్చినా కూడా తాను ఎక్కడి నుంచి వచ్చారో మరిచిపోకుండా తన తల్లికి తన చేతుల మీదుగా చెక్కును అందించడం అందరికీ ఒక గొప్ప సందేశాన్నిచ్చింది. ఈ ఘటన ఆ ప్రాంతంలోనే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది.