తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ 'అతడు' ట్రైన్ సీన్ గుర్తుందా..? ఆ మూవీలో హీరో మహేష్ బాబు సుపారీ కిల్లర్‌ రోల్‌లో ఓ డీల్ కుదుర్చుకుంటాడు. డీల్ తర్వాత డబ్బులు ఉన్న బ్యాగును ట్రైన్‌లో ఓ వ్యక్తికి ఇచ్చి పంపిస్తాడు కోట శ్రీనివాసరావు. అయితే సదరు వ్యక్తికి తెలియకుండానే అదే ట్రైన్‌లో చాలా తెలివిగా.. మహేష్ బాబు బ్యాగును కట్ చేసి అందులోనే డబ్బులతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఈ సీన్ చాలా ఫేమస్. ఇప్పటికీ మీమ్స్‌లో వాడుతుంటారు. అచ్చం అటువంటి ఘటనే నల్గొండ జిల్లాలోని నకిరేకల్ కో-ఆపరేటివ్ బ్యాంకులో చోటు చేసుకుంది. అతడు సినిమాను తలపించేలా ఇద్దరు మహిళలు చాకచక్యంగా ఒక వ్యక్తి బ్యాగ్‌ను బ్లేడుతో కోసి డబ్బులు దొంగిలించారు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి రాగా.. చోరీ తీరు చేసి పోలీసులు సైతం షాక్ అయ్యారు. ఈ ఘటన 'అతడు' సినిమాలో మహేష్ బాబు డబ్బులు దొంగిలించే సన్నివేశాన్ని గుర్తుకు తెస్తోందని చర్చించుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. ఒగోడు గ్రామానికి చెందిన మాదా నాగరాజు గోల్డ్ లోన్ కోసు నకిరేకల్ కో-ఆపరేటివ్ బ్యాంకుకు ఇటీవల వెళ్లాడు. బంగారం బ్యాంకులో డిపాజిట్ చేసి రూ.3 లక్షలు లోన్ తీసుకున్నాడు. ఆ తర్వాత తన బ్యాగ్‌ను భుజానికి తగిలించుకుని బ్యాంకులోనే కూర్చున్నాడు. సరిగ్గా అదే సమయంలో.. ఇద్దరు మహిళలు అతడి పక్కన అటు, ఇటుగా కూర్చుకున్నారు. సినిమాల్లో మాదిరిగా.. ఒక మహిళ నాగరాజు దృష్టిని మరల్చగా.. మరో మహిళ చాకచక్యంగా అతడి బ్యాగ్‌ను బ్లేడుతో కోసింది. బ్యాగ్‌లోని రూ. 2.50 లక్షల నగదు కిందపడిపోవడంతో వాళ్ళు ఆ డబ్బును తమ వెంట తెచ్చుకున్న కవర్‌లో చుట్టేసుకొని.. ఎవరికీ అనుమానం రాకుండా బయటకు వెళ్ళిపోయారు.ఈ మొత్తం వ్యవహారం బ్యాంకులోని సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయింది. బ్యాంకు నుంచి బయటకు వచ్చిన తర్వాత బ్యాగ్‌ను చూసుకున్న నాగరాజు.. డబ్బులు లేకపోవడంతో షాక్ తిన్నాడు. వెంటనే బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఆ మహిళల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అంత ఈజీగా ఎలా డబ్బు కొట్టేశారని చర్చించుకుంటున్నారు. కాగా, డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. బ్యాంకులకు వెళ్లిన సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.