తెలంగాణలో కురుస్తున్న దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. వర్షాల వల్ల కొన్ని రైలు మార్గాల్లో వరద నీరు చేరడంతో ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (CPRO) శ్రీధర్ ఈ వివరాలను వెల్లడించారు. ఈ రైళ్లు ప్రధానంగా హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు నడిచేవి. రద్దైన రైళ్లలో కొన్ని ప్యాసింజర్ రైళ్లు, మరికొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉన్నాయి. మరో 25 రైళ్ల మార్గాలను మార్చారు. ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాలైన కామారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల మీదుగా వెళ్లే రైళ్లను సురక్షితమైన మార్గాల ద్వారా మళ్లించారు. దీంతో ప్రయాణికులు గమ్యస్థానానికి చేరుకోవడానికి కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. మరో 14 రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. అంటే, ఈ రైళ్లు వాటి గమ్యస్థానానికి కొంత దూరం మాత్రమే ప్రయాణిస్తాయి. ఆ తర్వాత ప్రయాణం నిలిచిపోతుంది. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాల్సి ఉంటుంది. కామారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.కొన్ని చోట్ల రైలు మార్గాలపై వరద నీరు నిలిచిపోయింది. మరికొన్ని చోట్ల పట్టాలు కొట్టుకుపోగా.. అధికారులు మరమ్మత్తుల చేపట్టారు. దీని కారణంగా పట్టాలపై నీటి ప్రవాహం ప్రమాదకరంగా మారింది. ఈ పరిస్థితిని అంచనా వేసిన రైల్వే అధికారులు ముందు జాగ్రత్త చర్యగా రైళ్లను రద్దు చేయడం, దారి మళ్లించడం వంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఇక రద్దైన ట్రైన్ వివరాల కోసం టోల్ ఫ్రీ నెంబర్లు వెల్లడించారు. కాచిగూడ - 9063318082, నిజామాబాద్ - 9703296714, కామారెడ్డి - 9281035664, సికింద్రాబాద్ - 040 277 86170 నెంబర్లకు డయల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చునని చెప్పారు. ఇక తెలంగాణలో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఈ వర్షాలు ఇప్పట్లో ఆగే సూచనలు లేవని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ జిల్లాల్లో ఇప్పటికే ఉదయం 8 గంటల నుంచి కొన్ని చోట్ల 100 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. రానున్న మరికొన్ని గంటల్లో మరింత భారీ వర్షాలు కురిసి, పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా భారీ వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. ఈ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఎవరూ బయటకు వెళ్లవద్దు, ముఖ్యంగా వరద ప్రవాహం ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. అనవసర ప్రయాణాలు మానుకోవాలని సూచిస్తున్నారు.