ఏపీలో వారికి హెచ్చరిక.. 30 రోజుల్లో కచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోండి, లేకపోతే భారీగా జరిమానాలు

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌లో స్థిరాస్తి వ్యాపారం (రియల్ ఎస్టేట్ బిజినెస్) చేసేవారు, ఏజెంట్లు తప్పనిసరిగా ఏపీరెరా (ఆంధ్రప్రదేశ్ స్థిరాస్తి వ్యాపార ప్రాధికార సంస్థ)లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని రెరా ఛైర్మన్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ తెలిపారు. 30 రోజుల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెరా చట్టంలోని సెక్షన్ 9 ప్రకారం రిజిస్ట్రేషన్ తప్పనిసరి అన్నారు. రెరా చట్టంలోని సెక్షన్ 9 ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి కాబట్టి స్థిరాస్తి వ్యాపారం చేసేవారు, ఏజెంట్లు విధిగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలన్నారు. రాష్ట్రంలో రెరా అనుమతులు లేకుండా చేస్తున్న వేల మంది ఏజెంట్లను ప్రభుత్వం హెచ్చరించింది. ఇప్పటివరకు కేవలం 248 మంది ఏజెంట్లు మాత్రమే తమ వివరాలు నమోదు చేసుకున్నారని.. మిగిలిన వారు వెంటనే నమోదు చేసుకోవాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే భారీ జరిమానాలు, వ్యాపార కార్యకలాపాలపై నిషేధం విధిస్తామని హెచ్చరించారు. రెరా అనుమతులు లేని ఏజెంట్ల ద్వారా ఇళ్లు, స్థలాలు కొనొద్దని ప్రజలకు సూచించారు. ఇలాంటి లావాదేవీలకు రెరా చట్టం వర్తించదన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒకవేళ రిజిస్ట్రేషన్ విషయంలో ఏవైనా సందేహాలు ఉంటే.. రెరా కార్యాలయంలోని హెల్ప్‌లైన్‌ నంబరు 63049 06011కు కాల్ చేసి సంప్రదించాలని సూచించారు. ఈ నంబర్ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు అందుబాటులో ఉంటుందన్నారు. స్థిరాస్తి వ్యాపార సంఘాలైన నెరెడ్కో, క్రెడాయ్‌లు తమ పరిధిలోని ఏజెంట్లు రెరాలో రిజిస్టర్ అయ్యారో లేదో చూడాలని.. ఏజెంట్లు రెరాలో రిజిస్టర్ కావడం చాలా ముఖ్యం అన్నారు. సరిగ్గా సమాచారం ఇవ్వని కారణంగా 682 స్థిరాస్తి వ్యాపార ప్రాజెక్టులు రెరా (RERA) దగ్గర ఆగిపోయాయని.. దరఖాస్తుదారులు 30 రోజుల్లో సమాచారం ఇవ్వాలని, తప్పులను సరిదిద్దుకోవాలని.. లేదంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. కాబట్టి ఈ విషయాన్ని గమనించి.. నెల రోజుల్లోగా స్థిరాస్తి వ్యాపారం చేసేవారు, ఏజెంట్లు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.