విశాఖపట్నంలో రన్నింగ్ ఆర్టీసీ బస్సులో మంటలు.. భయంతో ప్రయాణికులు దూకేశారు

Wait 5 sec.

విశాఖపట్నంలో పెను ప్రమాదం తృటిలో తప్పిపోయింది. నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతి పురం జంక్షన్ దగ్గర ఓ పెట్రోల్ బంక్ ఎదురుగా ఆర్టీసీ రన్నింగ్ బస్సులో మంటలు చెలరేగాయి. బస్సులో నుంచి మంటలు రావడాన్ని వెనుక వస్తున్న ఆటో డ్రైవర్లు గమనించారు. వెంటనే డ్రైవర్ రమేష్‌ను అప్రమత్తం చేశారు.. ఆయన వెంటనే కండక్టర్ సాయికి విషయాన్ని చెప్పారు. డ్రైవర్ చాకచక్యంగా బస్సును అక్కడే రోడ్డుపై ఆపేశారు.. ఆ వెంటనే ప్రయాణికులు భయంతో బస్సులో నుంచి బయటకు పరుగులు తీశారు.. కొందరు బయటకు దూకేశారు. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 100మందికిపై పైగా ప్రయాణికులు ఉన్నట్లు కండక్టర్ చెబుతున్నారు. అక్కడ అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ బస్సు కూర్మన్నపాలెం నుంచి విజయనగరం వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదానికి కారణాలు ఏంటో తెలియాల్సి ఉంది. ఇంజిన్‌లో లోపంతో మంటలు చెలరేగాయా.. ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అన్నది క్లారిటీ లేదు. మరోవైపు విశాఖపట్నం సింధియా హిమాచల్‌నగర్ ప్రాంతంలో.. పారిశ్రామిక ప్రాంతమైన జింక్‌ గేటు సమీపంలో కూడా కారు దగ్ధమైంది. గురువారం ఉదయం కారులో నుంచి మంటలు చెలరేగాయి. ఈ కారు పదిరోజులుగా అక్కడే నిలిచి ఉంది.. గురువారం ఆ కారును స్టార్ట్‌ చేయగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే కారులో మంటలు వ్యాపించాయి.. అయితే కారులోని వారు వెంటనే అప్రమత్తమై బయటకు దూకేశారు. దీంతో వారు ప్రాణాలు దక్కించుకున్నారు. అందరూ చూస్తుండగానే కారు మొత్తం మంటలు చెలరేగాయి.. దీంతో స్థానికులు భయాందోళన చెందారు. వారు వెంటనే అలర్ట్ అయ్యారు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. వాళ్లు వచ్చేసరికి కారు సగానికిపైగా దగ్ధమైంది. పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు.. ఈ ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. విశాఖపట్నంలో ఇలా వరుసగా రెండు ప్రమాదాలు జరగడం కలకలం రేపింది.