ఆంధ్రప్రదేశ్‌‌ మీదుగా బుల్లెట్ రైళ్లు పరుగులు తీయనున్నాయి.. దేశంలోని ముఖ్యమైన నగరాల మధ్య వేగంగా రైళ్లు నడిపేందుకు కేంద్రం ప్లాన్ చేయగా.. రాష్ట్రం మీదుగా రెండు రైళ్లు ప్రతిపాదించారు. రాష్ట్ర రాజధాని అమరావతి మీదుగా ఈ రైళ్లు దూసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు మధ్య బుల్లెట్ రైళ్లు నడవనున్నాయి. దీనికి సంబంధించిన ప్రణాళికకు ప్రాథమికంగా ఆమోదం లభించింది. ఏపీ మీదుగా రెండు హైస్పీడ్ ఎలివేటెడ్ కారిడార్లను నిర్మిస్తున్నారు. ఈ కొత్త రైలు మార్గాల వల్ల రెండు తెలుగు రాష్ట్రాల రూపురేఖలు మారిపోతాయి. హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు కారిడార్లు. ఈ రెండు కారిడార్లలో హైదరాబాద్ నుండి శంషాబాద్ వరకు 38.5 కి.మీ దూరం ఒకే మార్గంలో ఉంటాయి. అక్కడి నుంచి చెన్నై, బెంగళూరు వైపు వేర్వేరు మార్గాలు ఉంటాయి.హైదరాబాద్-చెన్నై రైలు మార్గం అమరావతి మీదుగా వెళ్తుంది. అలాగే కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల మీదుగా కూడా వెళ్లేలా చూస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రయాణం చాలా సులువుగా, వేగంగా ఉంటుంది. ఈ మార్గంలో తెలంగాణలో ఆరు, ఆంధ్రప్రదేశ్‌లో ఎనిమిది, తమిళనాడులో ఒక స్టేషన్‌ను నిర్మిస్తారు. హైదరాబాద్‌-చెన్నై కారిడార్‌ విషయానికి వస్తే.. ఏపీలో ప్రతిపాదిత స్టేషన్లు ఇలా ఉన్నాయి.. అమరావతి, గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, నాయుడుపేట, తడలు ఉన్నాయి. హైదరాబాద్‌-బెంగళూరు కారిడార్‌లో.. ఏపీలో ప్రతిపాదిత స్టేషన్లు కర్నూలు, డోన్, గుత్తి, అనంతపురం, దుద్దేబండ, హిందూపురంలో ఉన్నాయి.హైదరాబాద్ నుండి చెన్నైకి హైస్పీడ్ రైలు మార్గం కోసం ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ప్రధానంగా 744.57 కి.మీ., 839.5 కి.మీ., 749.5 కి.మీ. పొడవుతో మూడు మార్గాలను పరిశీలించారు. చివరకు 744.5 కి.మీ. మార్గాన్ని ప్రాథమికంగా ఎంపిక చేశారు. హైదరాబాద్‌-ముంబై హైస్పీడ్‌ రైలు కారిడార్‌ నుంచి మొదలై.. శంషాబాద్, నార్కట్‌పల్లి, సూర్యాపేట, ఖమ్మం లేదా కోదాడ మీదుగా అమరావతిపు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. అక్కడి నుంచి గుంటూరు వైపు వెళ్తుంది. ఆ తర్వాత చీరాల మీదుగా విజయవాడ-చెన్నై రైల్వే లైన్‌కు సమాంతరంగా చెన్నైకి వెళ్తుంది అంటున్నారు.తెలంగాణలో 236.48 కి.మీ., ఆంధ్రప్రదేశ్‌లో 448.11 కి.మీ., తమిళనాడులో 59.98 కి.మీ. మేర ఈ మార్గం ఉంటుంది. ఈ మార్గాన్ని తిరుపతి మీదుగా మార్చితే తిరుమలకు వెళ్లే భక్తులకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు. గూడూరు నుంచి తిరుపతి మీదుగా చెన్నైకి వెళ్లేలా మార్గం మారిస్తే.. ఈ కారిడార్ పొడవు 53.5 కి.మీ. పెరుగుతుంది. అప్పుడు నాయుడుపేట, తడ పట్టణాలు ఈ మార్గంలో ఉండవు. ఈ ప్రాజెక్టులో రెండు వరుసల లైన్ (డబుల్ ట్రాక్), లూప్‌లైన్లు, సైడింగ్స్‌తో కలిపి మొత్తం 1,419.4 కి.మీ. ట్రాక్ నిర్మించాలని భావిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు మధ్య హైస్పీడ్ రైలు మార్గం కోసం మూడు ప్రణాళికలు (576.6 కి.మీ., 558.2 కి.మీ., 621.8 కి.మీ. )ను రైల్వే శాఖ పరిశీలిస్తోంది. వీటిలో 576.6 కి.మీ. పొడవైన మార్గాన్ని ప్రాథమికంగా ఎంపిక చేశారు. ఈ మార్గం పూర్తయితే హైదరాబాద్, బెంగళూరు మధ్య ప్రయాణం చాలా సులువు అవుతుంది. హైదరాబాద్‌-బెంగళూరు కారిడార్ హైవేకి సమాంతరంగా వెళ్తుంది. ఏపీలో 6, తెలంగాణలో 4, కర్ణాటకలో 3 స్టేషన్లు ప్లాన్ చేస్తున్నారు. పెనుకొండ సమీపంలో కియా పరిశ్రమ ఉండటంతో అక్కడ దుద్దేబండ దగ్గర స్టేషన్‌ ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణలో 218.5 కి.మీ., ఏపీలో 263.3 కి.మీ., కర్ణాటకలో 94.80 కి.మీ ఉంటుంది. ఈ కారిడార్‌లో డబుల్‌ లైన్, అదనంగా లూప్‌లైన్స్, సైడింగ్‌లు కలిపి మొత్తం 1,363 కి.మీ. మేర ట్రాక్‌ నిర్మించాల్సి ఉంటుంది. హైదరాబాద్‌-అమరావతి-చెన్నై, హైదరాబాద్‌-బెంగళూరు మధ్య బుల్లెట్‌ రైళ్ల కారిడార్లు అందుబాటులోకి వస్తే నగరాల మధ్య గంట నుంచి రెండు గంటల్లోనే చేరుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.