టీవీ నటుడు, కు గట్టి షాక్ తగిలింది. అతడికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. అలానే రూ.12,500లు జరిమానా కూడా విధించింది. ఇంతకు ఏ కేసులో కోర్టు లోబోకు జైలు శిక్ష విధించింది అంటే.. ఏడు సంవత్సరాల క్రితం జరిగిన ఓ యాక్సిడెంట్ కేసులో ఈ తీర్పు వెల్లడయ్యింది. తన కారులో వరంగల్ నుంచి హైదరాబాద్ వస్తున్న లోబో.. రఘునాథపల్లి మండలం వద్ద ఓ ఆటోను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా.. కొందరికి గాయాలయ్యాయి. నాడు నమోదైన కేసులో తాజాగా లోబోకు కోర్టు శిక్ష విధించింది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించడమే కాక మరికొందరు గాయపడటానికి కారణమైన లోబోకు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. జనగామ జిల్లా రఘునాథపల్లి సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐలు తెలిపిన వివరాల ప్రకారం.. ఏడు సంవత్సరాల క్రితం అనగా.. 2018, మే 21న వీడియో షూట్ చేయడానికి గాను.. తన టీమ్‌తో కలిసి వరంగల్ జిల్లాలోని లక్నవరం, భద్రకాళి చెరువు, రామప్ప, వేయిస్తంభాల ఆలయం వంటి ప్రాంతాల్లో పర్యటించారు. ఆ తర్వాత వరంగల్ నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ సమయంలో లోబోనే స్వయంగా కారు నడిపారు. ఈక్రమంలో లోబో కారు డ్రైవ్ చేస్తూ హైదరాబాద్‌కు వస్తుండగా.. రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద యాక్సిడెంట్ జరిగింది. లోబో తన కారుకు ఎదురుగా వచ్చిన ఓ ఆటోను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో మేడె కుమార్, పెంబర్తి మణెమ్మలు అనే ఇద్దరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూనే చనిపోయారు. అలానే ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న మరి కొందరికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో లోబో, అతడి టీమ్ ప్రయాణిస్తున్న కారు కూడా బోల్తా పడింది. దీంతో వారికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఈప్రమాదం గురించి మృతుల కుటుంబ సభ్యుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్పటి రఘునాథపల్లి పోలీసులు లోబోపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో తాజాగా జనగామ కోర్టు తీర్పు వెల్లడించింది. యాక్సిడెంట్ చేసి ఇద్దరి మృతికి కారణమైనందుకు గాను లోబోకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.12,500 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించిందని.. పోలీసులు తెలిపారు. మరి దీనిపై లోబో రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.