రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు కూడా ఫైబర్ ఇంటర్నెట్ అందించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారత్ నెట్‌ మధ్య ఒప్పందం కుదిరింది. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా నాయుడు, కేంద్ర మంత్రి సమక్షంలో ఈ మేరకు ఎంవోయూపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం ఏపీలోని గ్రామీణ ప్రాంతాలలో భారత్‌ నెట్‌ ప్రాజెక్టు అమలు చేయనున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో డిజిటల్‌ సేవల విస్తరణకు భారత్‌ నెట్‌ నుంచి సహకారం అందించనున్నారు. మరోవైపు దేశంలోని 5 లక్షల గ్రామాలకు ఫైబర్‌ కనెక్షన్‌ అందించాలనే లక్ష్యంతో భారత్‌ నెట్‌ ప్రాజెక్టును కేంద్రం చేపడుతోంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏబీపీ అమలు కోసం రూ.2,432 కోట్లు విడుదల చేయడానికి కూడా అంగీకరించింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం.. ఈ ప్రాజెక్టు అమలు చేయడం కోసం ఏపీబీఐఎల్‌ పేరుతో స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13,426 పంచాయతీల్లో ప్రాజెక్టు అమలు చేయనున్నారు. మరోవైపు ఒప్పందం అనంతరం మాట్లాడిన సీఎం చంద్రబాబు నాయుడు.. అప్పట్లో బ్యాండ్‌విడ్త్ కోసం చాలా ఇబ్బందులు పడ్డామని గతాన్ని గుర్తు చేసుకున్నారు. 2 ఎంబీపీఎస్ బ్యాండ్ విడ్త్‌తో కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్సులు నిర్వహించిన రోజులను గుర్తు చేసుకున్నారు. అమెరికా పర్యటన తర్వాత ఇంటర్నెట్ విప్లవం వల్ల ప్రపంచం మొత్తం ఒక కుగ్రామంగా మారుతుందని గుర్తించానని అన్నారు. ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలో బీఎస్‌ఎన్ఎల్ 4G టెక్నాలజీ తేవటం గొప్ప విజయమని ప్రశంసించారు.గతంలో పాలసీ మేకర్లు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి పెద్దగా ఆలోచనలు చేయలేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అయితే ఈ ప్రభుత్వం మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టిందని వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 970 సేవలను వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందిస్తున్న విషయాన్ని వివరించారు. భూములకు సంబంధించిన రికార్డులను క్యూ ఆర్ కోడ్ ద్వారా భద్రపరుస్తున్నామని.. సంజీవని ప్రాజెక్టు ద్వారా ఆరోగ్య రంగంలోనూ రియల్ టైమ్ మానిటరింగ్ వైద్య సేవలు తెస్తున్నట్లు చంద్రబాబు వివరించారు. డ్రోన్ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, స్పేస్ టెక్నాలజీ, సెమీకండక్టర్స్, రోబోటిక్స్ రంగాల్లో యువతకు మంచి అవకాశాలు ఉన్నాయన్న చంద్రబాబు.. ప్రతీ కుటుంబం ఒక ఏఐ వినియోగాన్ని అలవాటు చేసుకోవాలని చంద్రబాబు సూచించారు.