జపాన్ జూలో గుండెలు పిండేసే దృశ్యం: తల్లికి దూరమైన కోతి పిల్ల, మెత్తటి బొమ్మలో అమ్మను వెతుక్కుంటున్న వైనం

Wait 5 sec.

: ప్రేమ, అనుబంధం, ఒంటరితనం.. ఇవి కేవలం మనుషులకే కాదు మూగజీవాలకు కూడా సమానంగా ఉంటాయని నిరూపించే ఒక హృదయ విదారక దృశ్యం జపాన్‌లోని ఒక జూలో ఆవిష్కృతమైంది. తల్లికి దూరమైన ఒక అనాథ కోతి పిల్ల.. తన తల్లి ప్రేమ, స్పర్శ కోసం అల్లాడిపోయింది. ఇతర కోతుల్లో తన తల్లిని చూసుకోవాలని వాటి వద్దకు వెళ్తే.. అవేమో కొట్టడం, దూరంగా విసిరేయడం చేశాయి. దీంతో ఆ వానరం విలవిల్లాడిపోయింది. కానీ జూ సిబ్బంది ఆ కోతి పిల్లకు ఓ కోతి బొమ్మను ఇవ్వగా.. దాన్నే తన తల్లిగా భావిస్తూ మురిసిపోయిందా వానరం. అనుక్షణం దాన్ని కౌగిలించుకుంటూ, కనీసం చేతులోంచి కింద కూడా పెట్టకుండా.. ఆ బొమ్మలోనే తన తల్లిని చూసుకుంటోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతుండగా.. అంతా కన్నీరు పెడుతున్నారు. ఆ బొమ్మే దానికిప్పుడు సర్వస్వం..జపాన్‌లోని ఒక జూలో ఓ చిన్న కోతి పిల్ల తన తల్లి నుంచి విడిపోయింది. ఎడబాటు అంటే ఏమిటో తెలియని ఆ పసి ప్రాణి.. తన ఒంటరితనాన్ని భరించలేక జూ సిబ్బంది ఇచ్చిన ఒక ఒరాంగుటాన్ మెత్తటి బొమ్మను తన చేతుల్లోకి తీసుకుంది. ఆ బొమ్మనే తన తల్లిగా భావిస్తూ.. దానిని గట్టిగా హత్తుకుని పడుకోవడం చూసి సందర్శకులు ఆశ్చర్యానికి, ఆవేదనకు గురవుతున్నారు.ముఖ్యంగా ఈ చిన్నారి కోతి ఎక్కడికి వెళ్లినా ఆ బొమ్మను తనతో పాటే మోసుకెళ్తోంది. దానిని ఏమాత్రం వదిలిపెట్టడం లేదు. ఎవరైనా ఆ బొమ్మను తీయడానికి ప్రయత్నిస్తే.. అది తన తల్లిని కోల్పోతాననే భయంతో మరింత గట్టిగా అతుక్కుపోతోంది. ఆ మెత్తటి బొమ్మ ఇచ్చే వెచ్చదనంలోనే తన తల్లి స్పర్శను వెతుక్కుంటోందని పర్యాటకులు భావోద్వేగంతో చెబుతున్నారు. జూని సందర్శించిన కొందరు ఈ దృశ్యాన్ని చూసి కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్ిటంట వైరల్ అవుతుండగా.. ఇది చూసిన ప్రతీ ఒక్కరూ పెద్ద ఎత్తున లైకులు, షేర్లు, కామెంట్లు చేస్తున్నారు. "జంతువులకు కూడా మనలాగే భావాలు ఉంటాయని చెప్పడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ" అంటూ తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. "తల్లి ప్రేమకు సాటి ఏదీ లేదని ఈ కోతి పిల్ల నిరూపిస్తోంది" అని మరికొందరు రాసుకొన్నారు. మరి వీటిని చూస్తే మీకేమనిపిస్తుందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.