ఖమ్మంలో సంచలనం రేపిన పోలీసులు ఛేదించారు. శ్రీనివాస్‌ది హత్యగా నిర్ధారించిన పోలీసులు.. హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని తేల్చారు. నిందితుడు వేణుమాధవరెడ్డి సుపారీ గ్యాంగ్ సాయంతో బొగ్గుల శ్రీనివాస్‌ను హత్య చేయించినట్లు పోలీసులు గుర్తించారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఖమ్మం గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఏసీపీ తిరుపతి రెడ్డి వెల్లడించారు. ఏసీపీ తిరుపతిరెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. బొగ్గుల శ్రీనివాస్‌కు boggula bbq పేరుతో GST లైసెన్స్ ఉంది. అయితే బొగ్గుల శ్రీనివాస్ జీఎస్టీ లైసెన్స్ పర్మిషన్‌ను అతని స్నేహితుడు వేణుమాధవరెడ్డి వాడుకున్నారు. సబ్ కాంట్రాక్టరుగా పనిచేసే వేణుమాధవ్ రెడ్డి.. శ్రీనివాస్‌కు ఉన్న GST లైసెన్సుతో కలిసి పని చేద్దామని సూచించారు. అయితే ఇందుకు గానూ తనకు 50 శాతం వాటా ఇవ్వాలని బొగ్గుల శ్రీనివాస్ కోరారు. ఇద్దరి మధ్య అంగీకారం కుదరటంతో 2022 నుంచి 2025 వరకు కలిసి వ్యాపారం చేశారు. వ్యాపారంలో 90 లక్షలు లాభం వచ్చింది. అయితే శ్రీనివాస్‌కు15 లక్షలు మాత్రమే ఇచ్చారు. మిగతా 35 లక్షల రూపాయలు తర్వాత ఇస్తానని చెప్పారు.అయితే జీఎస్టీ ఎగ్గొట్టారంటూ శ్రీనివాస్‌కు అధికారుల నుంచి నోటీసులు వచ్చాయి. అలాగే శ్రీనివాస్ జీఎస్టీ పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. దీంతో లైసెన్స్ పునరుద్ధరించటంతో పాటుగా తనకు రావాల్సిన రూ.35 లక్షలు ఇవ్వాలంటూ బొగ్గుల శ్రీనివాస్.. వేణుమాధవ్‌రెడ్డిని కోరారు. ఈ క్రమంలోనే బొగ్గుల శ్రీనివాస్ ఒత్తిడి తేవటంతో.. అతన్ని హత్య చేయాలని వేణుమాధవ్ రెడ్డి ప్లాన్ వేశారు. ముందుగా అనుకున్న ప్రకారం ఫిబ్రవరి13వ తేదీన బొగ్గుల శ్రీనివాస్‌కు విజయవాడలో డబ్బులు ఇప్పిస్తానని చెప్పిన వేణుమాధవ్ రెడ్డి.. అతన్ని మరో ముగ్గురితో కలిసి కారులో తీసుకెళ్లారు. నార్కెట్ పల్లి వద్ద బొగ్గుల శ్రీనివాస్‌ను హత్య చేశారు. కత్తులు, ఇనపరాడ్లతో కొట్టి చంపారు.ఆ తర్వాత బొగ్గుల శ్రీనివాస్ హత్యను రోడ్డుప్రమాదంగా చిత్రీకరించేందుకు కారును పాలేరు రిజర్వాయర్‌లోకి తోసేసి రహదారి ప్రమాదంగా చిత్రీకరించారు." అని ఏసీపీ తిరుపతిరెడ్డి వెల్లడించారు. సాక్ష్యాధారాలు, సాంకేతిక ఆధారాలతో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ఏసీపీ వివరించారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని.. వారి నుంచి నాలుగు ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ చెప్పారు. మరోవైపు ఫిబ్రవరి 14వ తేదీ పాలేరు జలాశయం వద్ద కారును మత్స్యకారులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కారును వెలికితీస్తే శ్రీనివాస్ మృతదేహం కనిపించింది. అయితే శ్రీనివాస్ మృతి మీద అతని సోదరుడు అనుమానాలు వ్యక్తం చేయడంతో.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరిపారు. ఈ క్రమంలోనే బొగ్గుల శ్రీనివాస్‌ది హత్యగా తేల్చారు.