హైదరాబాద్ మహానగర విస్తరణపై రేవంత్ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌లకు తోడుగా.. భారత్ ఫ్యూచర్ సిటీ పేరుతో ఫోర్త్ సిటీని నిర్మిస్తోంది. నగరానికి దక్షిణ దిశలో మీర్‌ఖాన్ పేట ఏరియాలో దాదాపు 30 వేల ఎకరాల్లో కొత్త నగరం రూపుదిద్దుకుంటోంది. ఇక పెంచుతోంది. గతంలోనే పలు గ్రామాలను హెచ్ఎండీఏ పరిధిలో చేర్చగా.. తాజాగా మరో నాలుగు గ్రామాలను కూడా చేర్చారు. సోమవారం (ఫిబ్రవరి 23) సెక్రటేరియట్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వికారాబాద్ జిల్లాలోని నవాబ్ పేట్ మండలంలోని చిట్టిగూడ, యావపూర్, మోమిన్ పేట మండలం టేకులపల్లి, ఎంకతాల గ్రామాలను హెచ్ఎండీఏ పరిధిలోకి చేర్చారు. దీంతో హెచ్ఎండీఏ పరిధిలోని గ్రామాల సంఖ్య 1359కి చేరింది. ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధిలో 11 జిల్లాలు, 104 మండలాలు, 1359 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. గతంలో హెచ్‌ఎండీఏ విస్తీర్ణం 7,257 చదరపు కిలోమీటర్లు కాగా.. 7 జిల్లాలు, 74 మండలాలు, సుమారు 1000 గ్రామపంచాయతీలు ఉండేవి. గతేడాది మరో 3 వేల చదరపు కిలోమీటర్లు విస్తరస్తూ.. 10,472.72 చదరపు కిలోమీటర్లగా నిర్ణయించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, నల్గొండ, వికారాబాద్‌, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాలను హెచ్ఎండీఏ పరిధిలో చేర్చారు. హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ రీజియన్‌లో రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 533 గ్రామాలు ఉన్నాయి. అతి తక్కువగా నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 3 గ్రామాలు ఉన్నాయి. ఇక కేబినెట్ భేటీలో హైదరాబాద్‌ మహానగరానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. నగరంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాల‌కు అవ‌స‌ర‌మైన 42 ఎక‌రాలను రక్షణ శాఖ నుంచి తీసుకున్నందున స‌మాన విలువైన భూములు కింద రక్షణ శాఖ‌కు కాప్రా మండ‌లంలో 153 ఎక‌రాలు బదలాయింపు చేశారు. కాంప్రహెన్సివ్‌ రోడ్‌ మెయింటెనెన్స్‌ ప్రోగ్రామ్‌ రెండోదశకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.