టీ20 వరల్డ్‌కప్‌లో విండీస్ ఉగ్రరూపం చూపెట్టింది. సూపర్ 8లో భాగంగా వాంఖడేలో జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్‌లో హెట్మెయర్ ఊచకోతతో వెస్టిండీస్ రికార్డు స్కోర్ నమోదు చేసింది. వచ్చిన అవకాశాలను వదులుకున్న జింబాబ్వే జట్టు భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. జింబాబ్వే బౌలర్ల మీద విరుచుకుపడ్డ విండీస్ బ్యాటర్లు ఆఖరి పది ఓవర్లలో ఏకంగా 139 పరుగులు నమోదు చేశారు. దాంతో వెస్టిండీస్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 254 పరుగులు నమోదు చేసింది. వాంఖడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆరంభంలో అద్భుతంగా బౌలింగ్ చేసిన జింబాబ్వే హెట్మెయర్ వచ్చిన తర్వాత లైన్ తప్పి భారీగా పరుగులు సమర్పించుకుంది. ఆరంభంలోనే హెట్మెయర్ క్యాచ్‌ని వదిలిపెట్టడంతో.. సిక్సర్ల మోత మోగించాడు. ఓపెనర్లు బ్రాండన్ కింగ్, షాయి హోప్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయారు. కింగ్ 12 బంతుల్లో 9 పరుగులే చేసి అవుటవ్వగా.. హోప్ 12 బంతుల్లో 14 పరుగులకు అవుటయ్యాడు. దాంతో పవర్ ప్లేలోనే ఓపెనర్లు ఇద్దరూ పెవిలియన్ బాట పట్టారు. ఫస్ట్ డౌన్‌లో వచ్చిన హెట్మెయర్ జింబాబ్వే బౌలర్లకు చుక్కలు చూయించాడు. ఫోర్లు, సిక్సర్లతో వాంఖడేలో బౌండరీల వర్షం కురిపించాడు. సికందర్ రజా బౌలింగ్‌లో వరుస సిక్సర్లు బాదిన హెట్మెయర్ కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. హెట్మెయర్ అటాకింగ్‌తో వెస్టిండీస్ జట్టు కేవలం 9.1 ఓవర్లలోనే వంద పరుగులు పూర్తి చేసుకుంది. మొదటి పది ఓవర్ల తర్వాత రెచ్చిపోయిన వెస్టిండీస్ బ్యాటర్లు 13 ఓవర్లు ముగిసే సమయానికి 150 పరుగులు నమోదు చేశారు. పది ఓవర్ల తర్వాత స్పీడు పెంచిన రోవ్‌మన్ పావెల్ 29 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 34 బంతులు ఆడిన 7 ఫోర్లు, 7 సిక్సర్లతో 85 పరుగులు చేసి అవుటయ్యాడు. హెట్మెయర్ - పావెల్ కలిసి మూడో వికెట్‌కు 52 బంతుల్లో 122 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. 35 బంతులు ఆడిన పావెల్ 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 59 పరుగులు చేసి అవుటయ్యాడు. మొదటి పది ఓవర్లలో 115 పరుగులు చేసిన వెస్టిండీస్ జట్టు.. ఆఖరి పది ఓవర్లలో 139 పరుగులు చేసింది. 17 ఓవర్లకే వెస్టిండీస్ జట్టు 200 మార్క్‌ను దాటేసింది. ఆఖర్లో రూదర్‌ఫోర్డ్ 13 బంతుల్లో 31, రొమారియో షెఫర్డ్ 10 బంతుల్లో 21 పరుగులు చేయడం.. ఆఖరి ఓవర్‌లో 6, 6, 4 రావడంతో వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. కెప్టెన్ సికందర్ రజా 3 ఓవర్లలో 52 పరుగులు సమర్పించుకోవడం విశేషం.