ZPTC, MPTC ఎన్నికలపై అప్డేట్.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం..!

Wait 5 sec.

తెలంగాణలో ఇటీవల మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. 7 మున్సిపల్ కార్పోరేషన్లతో పాటు 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఇక పంచాయతీ ఎన్నికలు కూడా డిసెంబర్‌లో ముగిశాయి. ఇక మిగిలింది పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ సత్తా చాటింది. 80 శాతానికి పైగా స్థానాలు కైవసం చేసుకుంది. ఇదే ఊపులో మిగిలిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో రాజకీయ నిరుద్యోగులు సైతం త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్నికల నిర్వహణపై అప్డేట్ వచ్చింది. ఇప్పట్లో ఎన్నికలు జరిగేలా కనిపించటం లేదు. ఎందుకంటే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించి బిల్లును రూపొందిచగా.. ప్రస్తుతం అది కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏదో ఒకటి తేల్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. సోమవారం ఈ అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీ తీర్మానాన్ని, బిల్లును కేంద్రానికి ఇప్పటికే పంపినందున దానిపై ఎలాంటి నిర్ణయం వస్తుందో వేచిచూద్దామని సీఎం మంత్రులతో అన్నట్లు సమాచారం. అప్పటి వరకు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు వెళ్లకుండా ఉందామని మంత్రులతో సీఎం రేవంత్ అన్నట్లు సమాచారం. సీఎం నిర్ణయానికి మంత్రులు కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. దీంతో ఇప్పట్లో ఎన్నికలు జరిగే సూచనలు కనిపించటం లేదని ప్రభుత్వ వర్గాల ద్వారా వెల్లడైంది. ఇక తెలంగాణ ప్రభుత్వం వచ్చే నెల 3 నుంచి జూన్ 2న జరిగే రాష్ట్రావతరణ దినోత్సవ రోజు వరకు ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కేబినెట్ సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. ప్రతి ప్రభుత్వ శాఖలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేకంగా నివేదిక తయారు చేయటంతో పాటు.. ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు పరిష్కరించేలా ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించాలని సీఎం రేవంత్ సీఎస్ రామకృష్ణారావుకు సూచించినట్లు పార్టీవర్గాలు వెల్లడించాయి.