‘ప్రసాద్‌’ పరిధిలోకి కాణిపాకం ఆలయం.. కేందమంత్రి రామ్మోహన్‌నాయుడు కీలక ప్రకటన

Wait 5 sec.

చిత్తూరు జిల్లా కాణిపాకం స్వయంభూ శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయానికి సంబంధించి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తీపికబురు చెప్పారు. కాణిపాకం ఆలయాన్ని కేంద్రం సాయంతో అభివృద్ధి చేస్తామన్నారు. కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న ‘ప్రసాద్‌’ పథకం ద్వారా నిధులు కేటాయించేలా కృషి చేస్తానన్నారు. రామ్మోహన్ నాయుడు ఆదివారం కాణిపాకం గణపయ్యను దర్శించుకున్నారు.. కేంద్రమంత్రితో పాటుగా మాజీ ఎంపీ గల్లా జయదేవ్, పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్‌లు స్వామిని దర్శించుకున్నారు. అంతకముందు కేంద్రమంత్రికి కాణిపాకం ఆలయంలో.. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్‌, ఆలయ కమిటీ ఛైర్మన్ మణినాయుడు, ఈవో పెంచలకిషోన్‌ ఘన స్వాగతం పలికారు. దర్శనం తర్వాత వేదాశీర్వాద మండపంలో ఆలయ పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించి స్వామి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు,జ్ఞాపికను అందజేశారు. అనంతరం కేంద్రమంత్రి కీలక ప్రకటన చేశారు.కేంద్రం దేశవ్యాప్తంగా పర్యాటక, ఆలయాల అభివృద్ధి కోసం ప్రసాద్‌ పథకాన్ని తీసుకొచ్చిందని. కూడా ప్రసాద్ పథకం కిందుకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని కేంద్ర మంత్రి రామ్మోహన్‌ తెలిపారు. ఈ నిధులతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయొచ్చన్నారు. భవిష్యత్తులో కాణిపాకం స్వయంభూ శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. కేంద్రం సహకారంతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. కాణిపాకం ఆలయానికి 25 ఏళ్ల క్రితం వచ్చానని.. తన మనసులో ఉన్న గణపయ్య ఆలయానికి.. ప్రస్తుతం ఉన్న ఆలయానికి చాలా తేడా ఉందన్నారు. కాణిపాకం ఆలయానికి దగ్గర్లో ఉన్న నేషనల్ హైవేలో పనులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వేగవంతం అయ్యాయన్నారు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు. ప్రధాని మోదీ సహకారంతో బ్రాండ్‌ ఆంధ్రప్రదేశ్‌ను కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్‌ తీర్చిదిద్దారన్నారు. ఏపీ ప్రపంచంలోని పెట్టుబడులకు కేంద్రంగా మారిందని.. ఏఐ వంటి పెద్దపెద్ద డెటా సెంటర్లు, క్వాంటమ్‌ వ్యాలీ టెక్నాలజీకి గొప్ప వేదికగా మారిందన్నారు రామ్మోహన్ నాయుడు. కేంద్రమంత్రి ప్రకటనతో కాణిపాకం ఆలయానికి త్వరలోనే తీపికబురు వస్తుందని.. ప్రసాద్ పథకం కింద అభివృద్ధి ఖాయం అంటున్నారు.