పై కెప్టెన్ నిజాయితీగా స్పందించాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక మ్యాచ్‌లో భారత్ పవర్‌ప్లేలోనే మ్యాచ్‌ను చేజార్చుకుందని అంగీకరించాడు.188 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత జట్టు ఆరంభంలోనే తీవ్రంగా తడబడింది. కేవలం 4.3 ఓవర్లలో 26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఇషాన్ కిషన్ డకౌట్‌గా వెనుదిరగగా, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ కూడా త్వరగా అవుటయ్యారు. దీంతో ఛేజ్ ఆరంభంలోనే దెబ్బతింది.అభిషేక్ శర్మ టోర్నీలో తొలిసారి ఖాతా తెరిచినా, ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. మార్కో యాన్సెన్ వేసిన నకిల్ బాల్‌కు అవుటయ్యాడు. వరుసగా ముగ్గురు ఎడమచేతి బ్యాట్స్‌మెన్ అవుటవడంతో భారత ఇన్నింగ్స్ పూర్తిగా గాడి తప్పింది. చివరికి భారత్ కేవలం 111 పరుగులకే ఆలౌటై, సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.ఈ ఓటమి భారత్‌కు టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే అతిపెద్ద పరాజయంగా నమోదైంది. గతంలో ఆస్ట్రేలియాతో ఎదురైన 49 పరుగుల ఓటమిని కూడా ఇది దాటిపోయింది. అలాగే, ఐసీసీ టోర్నీల్లో భారత్ కొనసాగించిన 18 మ్యాచ్‌ల విజయ పరంపర కూడా ఇక్కడితో ముగిసింది.మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ మాట్లాడుతూ “180-185 పరుగులు ఛేజ్ చేస్తున్నప్పుడు పవర్‌ప్లేలోనే గెలవలేం. కానీ అక్కడే మ్యాచ్ ఓడిపోవచ్చు. మేం అదే చేశాం. చాలా త్వరగా వికెట్లు కోల్పోయాం. చిన్న భాగస్వామ్యాలు కూడా కుదరలేదు. అదే మా ఓటమికి కారణం” అని చెప్పాడు.బ్యాటింగ్‌లో విఫలమైనప్పటికీ, బౌలింగ్‌లో భారత్ మంచి ఆరంభం ఇచ్చిందని సూర్య గుర్తు చేశాడు. జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ కలిసి దక్షిణాఫ్రికాను మొదట్లోనే 21/3కి కుదించారు. దీంతో మ్యాచ్‌పై భారత్ పట్టు సాధిస్తుందనే ఆశలు కలిగాయి. కానీ ఆ తర్వాత డివాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్ జోడీ భారీ భాగస్వామ్యం నెలకొల్పింది. మధ్య ఓవర్లలో వేగంగా పరుగులు సాధించి స్కోర్‌ను 187/7 వరకు తీసుకెళ్లింది. అదే భారత్‌పై ఒత్తిడి పెంచింది.“బౌలింగ్‌లో మేం బాగా ప్రారంభించాం. మధ్య ఓవర్లలో వాళ్లు అద్భుతంగా ఆడారు. చివర్లో మళ్లీ మేం తిరిగి వచ్చాం. మొత్తంగా చూస్తే బౌలింగ్ బాగుంది. కానీ బ్యాటింగ్‌లో ఇంకా మెరుగ్గా ఆడాల్సింది” అని సూర్య వ్యాఖ్యానించాడు. ఈ ఓటమితో భారత్ సెమీఫైనల్ అవకాశాలు ప్రమాదంలో పడ్డాయి. ఇకపై జరిగే మ్యాచ్‌లు భారత్‌కు అత్యంత కీలకంగా మారాయి. ముఖ్యంగా జింబాబ్వే, వెస్టిండీస్‌తో జరిగే పోరాటాలపై భారత జట్టు ఆశలు పెట్టుకుంది.