154 శాతం పెరిగిన ట్రాఫిక్ చలాన్ల ఆదాయం.. ప్రజాపాలన కాదు, పెనాల్టీ పాలన అంటూ బండి సంజయ్ ట్వీట్

Wait 5 sec.

తెలంగాణలో ట్రాఫిక్ చలాన్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఆదాయం పెరిగినట్లు లెక్కలు వెల్లడి కావడంతో.. సర్కార్‌పై.. బీజేపీ నేత, కేంద్రమంత్రి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఇది ప్రజా పాలననా.. పెనాల్టీ పాలననా అంటూ తీవ్రంగా ఫైర్ అయ్యారు. కేవలం ఒక సంవత్సర కాలంలోనే ట్రాఫిక్ చలాన్ల వసూళ్లు 154 శాతం పెరగడం పట్ల కేంద్రమంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గతేడాది ట్రాఫిక్ చలాన్ల ద్వారా సర్కారుకు రూ.108.33 కోట్ల ఆదాయం సమకూరగా.. అది ఈ ఏడాది ఏకంగా రూ. 275.05 కోట్లకు పెరగడంపై రేవంత్ రెడ్డి సర్కార్‌ను బండి సంజయ్ ప్రశ్నించారు. ఈ లెక్కలు చూస్తుంటే గత ఏడాది కాలంలోనే ట్రాఫిక్ జరిమానాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 154 శాతం అంటే దాదాపు 2.5 రెట్లు పెరిగినట్లు ఆయన లెక్కలతో సహా వెల్లడించారు. ఇక ప్రజల నుంచి ఫైన్ల రూపంలో భారీగా డబ్బులు వసూలు చేసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. వారికి సరైన సౌకర్యాలు కల్పిస్తుందా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. చలాన్ల ద్వారా భారీగా ఆదాయం పెరిగినప్పుడు.. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు కూడా అదే స్థాయిలో మెరుగుపడ్డాయా అని నిలదీశారు. రోడ్లపై గుంతలు లేకుండా చేశారా.. ట్రాఫిక్ ఏమైనా తగ్గిందా అని అన్నారు. ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి మౌలిక వసతులు కల్పించకుండానే.. కేవలం వేసి.. వారి నుంచి డబ్బులు మాత్రమే వసూలు చేయడంపై దృష్టి పెట్టడం సరికాదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని సామాన్య ప్రజలను రేవంత్ రెడ్డి సర్కార్ ఒక వాకింగ్ ఏటీఎం లాగా వాడుకుంటోందని ఆరోపించారు.మరోవైపు.. ప్రజల వాహనాలపై పడిన ట్రాఫిక్ చలాన్‌లను నేరుగా వారి బ్యాంక్ అకౌంట్ల నుంచే ఆటో డెబిట్ చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనను బండి సంజయ్ తీవ్రంగా తప్పు పట్టారు. మొదట జరిమానాలను పెంచారని.. ఆ తర్వాత ట్రాఫిక్ పోలీసులకు టార్గెట్లు పెట్టి మరీ చలాన్లు వేయించారని.. ఇక ఇప్పుడు నేరుగా ప్రజల ఖాతాల నుంచి డబ్బులు కట్ చేయాలని చూడటం ఆటోమేటెడ్ దోపిడీలా ఉందని ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. ట్రాఫిక్ చలాన్లకు సంబంధించిన ఈ అన్ని నిర్ణయాలను రేవంత్ సర్కార్ పునరాలోచించుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.