టీటీడీ విజిలెన్స్ సిబ్బంది తమ నిజాయితీ చాటుకున్నారు. డబ్బులు ఉన్న బ్యాగ్ మర్చిపోయిన భక్తులకు తిరిగి దానిని అప్పగించారు. శ్రీవారి దర్శనం కోసం కొండపైకి వెళ్లే వాహనాలు, బస్సులు, ప్రైవేట్ వాహనాలను అలిపిరి చెకింగ్ పాయింట్ వద్ద టీటీడీ విజిలెన్స్ సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలించి పైకి అనుమతిస్తూ ఉంటారు. నిషేధిత వస్తువులు, ప్రమాదకర వస్తువులు కొండపైకి వెళ్లకూడదనే ఉద్దేశంతో అలిపిరి చెకింగ్ పాయింట్ వద్ద సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలోనే శనివారం హైదరాబాద్‌కు చెందిన అశ్వినీ కుమార్ అగర్వాల్ అనే భక్తుడు కుటుంబంతో పాటుగా తిరుపతికి వచ్చారు. తిరుమలకు వెళ్లేందుకు అలిపిరి వద్దకు చేరుకున్నారు. అయితే లగేజీ స్కాన్ చేసే క్రమంలో.. రూ.2 లక్షలు నగదు ఉన్న బ్యాగును అగర్వాల్ కుటుంబం మర్చిపోయింది. తిరుమలకు చేరుకుంది. అయితే డబ్బులు ఉన్న బ్యాగును భక్తులు మర్చిపోయిన సంగతిని టీటీడీ విజిలెన్స్ సిబ్బంది గుర్తించారు. బ్యాగులో రూ.2 లక్షలు నగదు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే టీటీడీ ఏవీఎస్‌వో రమేష్ కృష్ణకు దీనిపై సమాచారం అందించారు. అయితే ఈలోపు అశ్వినీ కుమార్ తిరిగి వచ్చి.. తాను డబ్బులు ఉన్న బ్యాగును మర్చిపోయినట్లు టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి తెలియజేశారు. రూ.500 నోట్ల కట్టలు నాలుగు.. బ్యాగులో ఉంచి మర్చిపోయినట్లు అధికారులకు వివరించారు. దీంతో డబ్బులు అతనివేనని నిర్ధారించుకున్న టీటీడీ విజిలెన్స్ సిబ్బంది.. అశ్వినీ కుమార్‌కు బ్యాగును తిరిగి అప్పగించారు. దీంతో అశ్వినీ కుమార్ టీటీడీ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.టీటీడీ అగరబత్తుల తయారీ కేంద్రం పరిశీలన మరోవైపు టీటీడీ జేఈవో శరత్ శనివారం రోజున తిరుపతిలోని ఎస్వీ గోసంరక్షణశాలలోని టీటీడీ అగరబత్తుల తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అగరబత్తుల తయారీ ప్రక్రియ, ముడిసరుకు వినియోగం, నాణ్యత ప్రమాణాలు, ప్యాకేజింగ్ విధానాన్ని పరిశీలించారు. అక్కడి సిబ్బందితో మాట్లాడి అగరుబత్తీల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కేంద్రంలో ఆరు రకాలైన అగరబత్తులను తయారుచేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.చామంతి, గులాబీ, తామర వంటి పూల సుగంధాలతో వీటిని తయారు చేస్తున్నారు.సంపంగి, తులసి సుగంధాలతో కొత్త రకాల అగరబత్తులను త్వరలో తయారు చేయనున్నారు. భక్తుల అభిరుచులకు తగిన విధంగా నాణ్యమైన, ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలిగించే ఉత్పత్తులను అందిస్తామని టీటీడీ జేఈవో తెలిపారు.