పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఖుషీ సినిమా చూశారా.. అందులో క్లైమాక్స్ గుర్తుందా.. పవన్ కళ్యాణ్, భూమిక కవల పిల్లలతో కనిపిస్తారు. ఒకరిద్దరు కాదు.. పదుల సంఖ్యలో కవల పిల్లలు అక్కడ కనిపిస్తారు. ఇలాంటి దృశ్యమే ఆదివారం రోజున ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో కనిపించింది. ఒకే పోలిక, ఒకే రూపంతో ఉన్న సుమారుగా వంద మంది కవలలు తిరుపతిలో సందడి చేశారు. (World Twins Day) సందర్భంగా తిరుపతిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈ కవలలు సందడి చేశారు. తిరుపతిలోని సీపీఐ కార్యాలయం ఇందుకు వేదికైంది.ఈ కార్యక్రమానికి హాజరైన జనం ఇంతమంది కవలలను ఒకచోట చూసి ఆశ్చర్యపోయారు. ఒకే రూపం, ఒకే డ్రస్సుతో ఉన్న చిన్నారులు, యువతను చూసి ఆశ్చర్యపోయారు. కార్యక్రమంలో భాగంగా కవలలతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు వచ్చినవారిని ఆకట్టుకున్నాయి. కేవలం వేడుకలకే కాకుండా, పాఠశాలల్లో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ పట్ల కవలలు తమ బాధ్యతను చాటుకున్నారు. కవలల ప్రయాణం తల్లిగర్భంలో ఒకేసారి, ఒకే రూపంతో మొదలవుతుంది. ఈ ప్రపంచంలోకి కొన్ని క్షణాల వ్యవధిలో అడుగు పెడతారు. ఒకే రూపు, ఒకే ముఖ కవళికలతో ఆకట్టుకోవడం కవలల ప్రత్యేకత. ఇక సైన్స్ ప్రకారం ఫలదీకరణ సమయంలో వచ్చే మార్పులే కవలల జననానికి కారణమని వైద్యులు చెప్తుంటారు.కవలలో ఇద్దరూ మగ పిల్లలు అయినా ఉండొచ్చు. లేదా ఇద్దరూ ఆడ పిల్లలు అయినా కావచ్చు. రెండు శుక్ర కణాలు ఏర్పడి జన్మించే కవల పిల్లలను డై జైగోటిక్‌ లేదా బైనోవిలార్‌ ట్విన్స్‌ అని పిలుస్తారు. కవలల దినోత్సవం ఎలా వచ్చిందంటే..పోలెంద్‌లో 1976లో తొలిసారిగా నిర్వహించారు.మోజెస్, విల్‌కాక్స్‌ అనే ఇద్దరు కవల సోదరులు తాము ఉంటున్న ప్రాంతానికి ‘ట్విన్స్‌ బర్గ్‌’ అని నామకరణం చేసుకున్నారు. అలాగే కవలలనే పెళ్లి చేసుకుని, మళ్లీ కవలలకే జన్మనిచ్చారు. అయితే ఇక్కడ దురదృష్టకరమైన విషయం ఏమిటంటే.. ఇద్దరూ ఒకే రకమైన వ్యాధితో ఒకే రోజు మరణించారు. దీంతో వీరి గుర్తుగా ఏటా ఫిబ్రవరి 22వ తేదీ అంతర్జాతీయ కవలల దినోత్సవం జరుపుతున్నారు. ఈ రకంగా అంతర్జాతీయ కవలల దినోత్సవం ఏర్పడింది.