: 56వ జీఎస్టీ పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సామాన్యులకు మేలు జరిగేలా ఎన్నో ప్రకటనలు వచ్చాయి. ఎక్కువగా నిత్యావసరాలపై జీఎస్టీ 12, 18 శ్లాబుల్లో నుంచి 0, 5 శాతానికి చేరాయి. దీంతో ఆయా వస్తువుల ధరలు తగ్గుతాయని చెప్పొచ్చు. ఇదే సమయంలో అవును.. గతంలో పాలసీలకు సంబంధించి 18 శాతం జీఎస్టీ అమల్లో ఉండేది. దీనిని ఇప్పుడు పూర్తిగా మినహాయించింది. అంటే సున్నా శాతానికి చేరిందన్నమాట. 2025, సెప్టెంబర్ 22 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని చెప్పొచ్చు. ఈ నిర్ణయం వల్ల.. బీమా పాలసీలు మరింత అందుబాటులోకి వస్తాయని.. మరింత మంది సామాన్యులు పాలసీలు తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తారని.. ఇది వారిపై ఆర్థిక భారం తగ్గిస్తుందని అభిప్రాయపడుతున్నారు నిపుణులు.కొవిడ్ తర్వాతి కాలంలో బీమా ఆవశ్యకత జనానికి తెలిసొచ్చింది. ఆస్పత్రికి వెళ్తే లక్షలకు లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని ప్రస్తుత పరిస్థితుల్లో.. బీమా కొండంత అండగా ఉంది. లక్షల్లో ఆదా అందిస్తుందని చెప్పొచ్చు. అయితే.. చాలా ప్రైవేట్ కంపెనీలు బీమా పాలసీలు అందిస్తుండగా.. దీని కోసం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ జీఎస్టీ 18 శాతంగా ఉండటంతో.. ఇంకా ఎక్కువ భారంగా ఉందని చాలా మంది వీటిని తీసుకోలేకపోతున్నారు. అయితే తాజాగా జీఎస్టీని మినహాయిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నిర్ణయంతో.. లక్షలాది కుటుంబాలకు ప్రయోజనం నేరుగా చేకూరుతుందని బీమా కంపెనీలు పేర్కొంటున్నాయి. మరి బీమాపై జీఎస్టీని సున్నా శాతానికి చేర్చినంత మాత్రాన పూర్తిగా ఈ ప్రయోజనాలు పాలసీదారులకు అందుతాయా.. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. >> పూర్తి ప్రయోజనాన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు.. జనాలకు అందించకపోవచ్చనే వాదనే వినిపిస్తోంది. కారణం ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (ITC). ప్రస్తుతానికి బీమా సంస్థలు.. 18 శాతం శాతం జీఎస్టీ వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఉదాహరణకు రూ. 1000 ప్రీమియం అనుకుంటే 18 శాతం జీఎస్టీతో కలిపి రూ. 1180 అవుతుంది.ఇదే సమయంలో బీమా కంపెనీలు.. ఆఫీస్ రెంట్, టెక్నాలజీ, క్లెయిమింగ్, కస్టమర్ సర్వీస్, మార్కెటింగ్ వంటి ఎన్నో కార్యకలాపాలపై జీఎస్టీ చెల్లించాల్సి వస్తుంది. ఇక్కడ ఆ కంపెనీలు.. కస్టమర్ల నుంచి వసూలు చేసిన జీఎస్టీని.. తాము చెల్లించిన జీఎస్టీతో సర్దుబాటు చేసుకోవచ్చు. అంటే ఇక్కడ తిరిగి తాము చెల్లించిన జీఎస్టీని క్లెయిమ్ చేసుకుంటున్నాయి. ఇప్పుడు మాత్రం.. ప్రీమియంపై జీఎస్టీని తొలగించడంతో.. కంపెనీలు ఐటీసీ ప్రయోజనాలు దక్కవు. ఈ భారాన్ని ఇప్పుడు కస్టమర్లకు బదిలీ చేస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా.. ఇక్కడ జీఎస్టీని పూర్తిగా మినహాయించే అవకాశం ఉందని.. కానీ ఇదే సమయంలో.. బేస్ ప్రీమియం మొత్తాన్ని 3-4 శాతం వరకు పెంచే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. చివరగా చూస్తే.. జీఎస్టీ 18 శాతం తగ్గింపుతో పోలిస్తే.. ఈ 3-4 శాతం పెంపు ఎక్కువ ఉండకపోవచ్చు. మొత్తంగా పాలసీదారులకు లబ్ది చేకూరుతుందని చెప్పొచ్చు. ఉదాహరణకు ఇప్పుడు మీ బేస్ ప్రీమియం మొత్తం ఏటా రూ. 30 వేలుగా ఉందనుకోండి. దీనిపై 18 శాతం జీఎస్టీ అంటే రూ. 5400 కలిపి గతంలో మొత్తం ప్రీమియం రూ. 35,400 గా ఉండేది. ఇప్పుడు సున్నా శాతం జీఎస్టీతో ఇది రూ. 30 వేలుగానే ఉండనుంది. ఒకవేళ బేస్ ప్రీమియం 4 శాతం వరకు పెంచినా.. ఈ మొత్తం రూ. 31,200 గానే ఉంటుంది. కాబట్టి.. చివరకు పాలసీదారులకు లబ్ధి చేకూరుతుందని చెప్పొచ్చు.