రాష్ట్రంలో ఫిబ్రవరిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కొన్ని పురపాలికల్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవుల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలోనే హైకోర్టు ఆదేశాలతో వాయిదా పడిన క్యాతన్‌పల్లి, ఇబ్రహీంపట్నం, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో ఛైర్మన్ ఎన్నికలు నిర్వహించగా.. ఖానాపూర్‌లో తీవ్ర ఉద్రిక్తతల నడుమ మరోసారి ఇవాల్టికి ఎన్నిక ప్రక్రియ వాయిదా పడింది. ఈ క్రమంలోనే ఎట్టకేలకు ఇవాళ ఛైర్మన్ ఎన్నిక నిర్వహించగా.. బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో బీజేపీ పార్టీ గెలుచుకుంది. ఛైర్ పర్సన్‌గా బీజేపీకి చెందిన అంకం మౌనిక, వైస్ ఛైర్మన్‌గా బీఆర్ఎస్ అభ్యర్థి మహ్మద్ సోయల్ ఎన్నికయ్యారు. ఖానాపూర్‌ పురపాలక సంఘంలో మొత్తం 12 కౌన్సిలర్‌ స్థానాలు ఉండగా.. అందులో బీఆర్‌ఎస్‌ పార్టీ 4.. బీజేపీ 4.. కాంగ్రెస్‌ పార్టీ 3.. స్వతంత్రులు ఒక స్థానంలో గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీకి స్వతంత్ర అభ్యర్థి మద్దతు తెలపడంతో పాటు.. ఎక్స్‌ అఫీషియో సభ్యుడి ఓటుతో.. ఆ పార్టీకి బలం ఐదుకు చేరింది. ఈ నేపథ్యంలోనే ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లభించలేదు. ఈ క్రమంలోనే బీజేపీకి బీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతు ప్రకటించడంతో.. ఈ రెండు పార్టీల బలం 8కి చేరింది. దీంతో బీజేపీ తరఫున ఛైర్ పర్సన్ అభ్యర్థిగా ఉన్న అంకం మౌనికకు మద్దతుగా బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన ఏడుగురు అభ్యర్థులు సభ్యులు చేతులెత్తడంతో ఎన్నిక ముగిసింది. ఇక వైస్ ఛైర్ పర్సన్‌గా బీఆర్ఎస్ పార్టీ తరఫున బరిలో నిలిచిన మహ్మద్ సోయల్‌ విజయం సాధించారు. శనివారం ఖానాపూర్ మున్సిపల్ కౌన్సిల్ హాలులో జరిగిన హైడ్రామా.. అధికారులతో జరిగిన వాగ్వాదంతో ఛైర్మన్ ఎన్నిక నేటికి వాయిదా పడిన సంగతి తెలిసిందే. మున్సిపల్ ఛైర్మన్ ఎంపిక కోసం శనివారం సమావేశం నిర్వహించగా.. ఎన్నికైన సభ్యులు చేతులు ఎత్తే క్రమంలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. తమకు మద్దతుగా ఏడుగురు సభ్యులు మద్దతు తెలిపారని ఎక్స్ అఫీషియో సభ్యుడు, పేర్కొనగా.. ఛైర్ పర్సన్‌గా బీజేపీ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించాలని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. దీంతో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు సహా కాంగ్రెస్ నేతలు వారికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో తీవ్ర ఉద్రిక్తతకు కారణం అయింది.