తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కూటమి పార్టీల మధ్య విభేదాలు మరోసారి వెలుగుచూశాయి. ఈ క్రమంలోనే టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి.. జనసేన నేత వార్నింగ్ ఇచ్చారు. సైలెంట్‌గా ఉన్నామంటే, చేతగానితనం కాదన్న కోట వినుత.. కూటమి ధర్మం మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌నుచూసి మౌనంగా ఉన్నామని అన్నారు. శ్రీకాళహస్తిలో అక్రమ కట్టడాలంటూ కొన్ని నిర్మాణాలను మున్సిపల్ అధికారులు కూల్చివేస్తున్నారు. ఈ క్రమంలోనే జనసేనకు చెందిన శివకుమార్ అనే కార్యకర్తకు చెందిన నిర్మాణంలో ఉన్న ఇంటిని మున్సిపల్ అధికారులు ఆదివారం కూల్చివేశారు. అయితే దీనిపై జనసైనికులు మండిపడుతున్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, తెల్లవారుజామునే ఇంటిని ఎలా కూల్చివేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే జనసేన నేత కోట వినుత ఘటనాస్థలిని పరిశీలించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ..ని హెచ్చరించారు. "ఆదివారం ఉదయం మూడున్నర గంటల సమయంలో కూల్చివేశారు. మున్సిపల్ కమిషనర్‌కు ఎందుకు అంత అత్యుత్సాహం. కోర్టు స్టే విధించిన సంగతి కూడా మున్సిపల్ కమిషనర్‌కు తెలుసు. పోలీసులు వచ్చి, ఆంక్షలు పెట్టి, శివకుమార్‌ను, ఆయన మామను జీపులో కూర్చోబెట్టి ఇదంతా చేశారు. ఇదేమీ కబ్జా చేసిన స్థలం కాదు. వాళ్లేం తప్పు చేశారు. వాళ్ల స్థలంలోకి మీరు వస్తే అడిగే హక్కు కూడా వారికి లేదా..? కూటమి ప్రభుత్వంలో ఉన్నామని, పవన్ కళ్యాణ్‌ను చూసి సైలెంట్‌గా ఉన్నాం. ఎమ్మెల్యే ఎందుకిలా చేస్తున్నారో అర్థం కావడం లేదు. అధికారికంగా చేయాలనుకుంటే నోటీసులు ఇచ్చి చేయండి. పోలీసులను అడ్డం పెట్టుకుని, ఇలా చేయడం ఏంటి? " అని కోట వినుత ప్రశ్నించారు"జనసేనను తొక్కాలనే ప్రయత్నం జరుగుతోంది. మాకేం పోరాటాలు కొత్త కాదు. జాగ్రత్త సుధీర్ రెడ్డి.. ఐదేళ్ల కష్టపడి పోరాటం చేసి, త్యాగం చేసి కూటమిని గెలిపించాం. అప్పుడు నువ్వెక్కడున్నావ్. ఎవరో కష్టపడితే గద్దలా వచ్చి ఎమ్మెల్యే పదవి ఎత్తుకెళ్లావ్. ఎమ్మెల్యే సీటులో కూర్చున్నదానికి బాధ్యతగా పనిచేయ్. జనసేన పార్టీ మీద పడటం మానేయ్. కూటమికి చెడ్డపేరు తెప్పిస్తున్నావ్. సైలెంటుగా ఉన్నామంటే చేతగానితనం అనుకోవద్దు. పవన్ కళ్యాణ్‌ను చూసి ఓపికగా ఉన్నాం. జనసేన తిరగబడితే ఎలా ఉంటుందో నీకు తెలుసు. మా వాళ్లను టచ్ చేస్తే ఏం చేయాలో అది చేస్తాం" అంటూ శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి కోట వినుత వార్నింగ్ ఇచ్చారు.