Market Rally: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ఉదయం నష్టాల్లో ట్రేడింగ్ మొదలు పెట్టినా ఆ తర్వాత యూటర్న్ తీసుకున్నాయి. మధ్యాహ్నం తర్వాత భారీ లాభాల్లోకి వచ్చేశాయి. ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా మధ్య కాల్పుల విరమణ బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ నష్టాల నుంచి ఏకంగా 1378 పాయింట్లు రికవరీ అయింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.5 లక్షల కోట్ల మేర పెరిగింది. కంపెనీల వాల్యూ రూ.427 లక్షల కోట్లకు చేరింది. ఏప్రిల్ 6వ తేదీ సోమవారం ఉదయం 73,477 వద్ద నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ ఆ తర్వాత చాలా సేపు నష్టాల్లోనే కొనసాగింది. ఒక దశలో 72,729 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకింది. అయితే, ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం కుదరవచ్చన్న వార్తలతో సూచీలు లాభాల్లోకి వచ్చాయి. ఇంట్రాడేలో 1378 పాయింట్లు కోలుకుని ఒక దశలో 74,207 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత 787 పాయింట్ల లాభంతో 74,107 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 50 ఇండెక్స్ 255 పాయింట్లు లాభపడింది 22,968 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో ట్రెంట్, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, ఎల్అండ్‌టీ, అల్ట్రాటెక్ వంటి స్టాక్స్ లాభపడ్డాయి. అయితే, రిలయన్స్, సన్ ఫార్మా, హెచ్‌సీఎల్ టెక్ వంటి షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. ఇక ఈరోజు భారత కరెన్సీ రూపాయి మారకం విలువ డాలరుతో పోలిస్తే రూ.93.05 వద్ద ట్రేడవుతోంది. అలాగే గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 108 డాలర్ల వద్ద అమ్ముడవుతోంది. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరితే హార్ముజ్ జల సంధి తెరుచుకుని మళ్లీ వాణిజ్యం ప్రారంభమయ్యే అవకాశం ఉండటం ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపింది. శాంతి చర్చల వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్ కు 110 డాలర్ల దిగువకు వచ్చింది. ఇదే భారత ఆర్థిక వ్యవస్థకు, ద్రవ్యోల్బణం కట్టడికి ఉపకరిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ చేపట్టిన చర్యల కారణంగా డాలరుతో పోలిస్తే రూపాయి విలువ కోలుకుంటోంది. కరెన్సీ మార్కెట్లో ఒడుదొడుకులు తగ్గడం స్టాక్ మార్కెట్ రికవరీకి దోహదపడింది.