బెంగళూరు నుంచి సికింద్రాబాద్‌కు ఊపిరితిత్తులు.. ఎయిర్‌పోర్టు నుంచి గ్రీన్ ఛానెల్ ద్వారా తరలింపు

Wait 5 sec.

ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మరోసారి కీలకంగా వ్యవహరించారు . బెంగళూరులో సేకరించిన ఊపిరితిత్తులను అత్యవసర చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. సాధారణంగా శంషాబాద్ విమానాశ్రయం నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లాలంటే భారీ ట్రాఫిక్ కారణంగా గంటల సమయం పడుతుంది. కానీ.. అవయవ మార్పిడి చికిత్సలో ప్రతి నిమిషం ఎంతో విలువైనది కావడంతో డాక్టర్లు వెంటనే నగర ట్రాఫిక్ పోలీసుల సహాయాన్ని కోరారు.దీంతో తక్షణమే స్పందించిన హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం పోలీసులు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి కిమ్స్ హాస్పిటల్ వరకు దాదాపు 35 కిలోమీటర్ల మేర బెంగళూరు నుంచి విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న డాక్టర్ల బృందం.. మధ్యాహ్నం సమయంలో ఊపిరితిత్తులను ప్రత్యేక అంబులెన్స్‌లోకి మార్చింది. సరిగ్గా అదే సమయంలో పోలీసులు అంబులెన్స్ వెళ్లే దారిలో ఉన్న అన్ని ట్రాఫిక్ సిగ్నళ్లను ఆపివేసి.. ఎక్కడా ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.ట్రాఫిక్ పోలీసుల సమన్వయంతో అంబులెన్స్ వాయు వేగంతో సురక్షితంగా సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి చేరుకుంది. ఈ గ్రీన్ ఛానెల్ ఏర్పాటు కేసం సైబరాబాద్, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా పనిచేశారు. ఊపిరితిత్తులు సకాలంలో ఆసుపత్రికి చేరడంతో కిమ్స్ డాక్టర్లు వెంటనే శస్త్రచికిత్సను ప్రారంభించారు. ఈ తరలింపు సాఫీగా సాగేలా పైలట్ వాహనాలు అంబులెన్స్‌కు ముందు వెనకా ఏర్పాటు చేశారు. గుండె, కాలేయం వంటి అవయవాలను తరలించేందుకు పోలీసులు ఇలాంటి గ్రీన్ ఛానెల్స్ ఏర్పాటు చేసి ఎంతో మంది ప్రాణాలను కాపాడారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా.. అత్యవసర వైద్య సేవల కోసం పోలీసులు చూపుతున్న ఈ చొరవను నగరవాసులు, రోగి బంధువులు అభినందిస్తున్నారు. విధి నిర్వహణలో మానవత్వాన్ని చాటుకున్న పోలీసుల కృషి వల్ల ఒక నిండు ప్రాణం నిలబడబోతోందని డాక్టర్లు తెలుపుతున్నారు. ఈ రకమైన వేగవంతమైన రవాణా వ్యవస్థలు అవయవ దాన ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అంటున్నారు.