Petrol Price: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులతో ముడి చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 115 డాలర్లు దాటేసింది. దీంతో దిగుమతిపై ఆధారపడే చాలా దేశాలు పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచాయి. అయితే, భారత్‌లో మాత్రం ఆ ప్రభావం ఇంకా పడలేదు. అయితే, దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ఎప్పుడైనా ఉండవచ్చనే ఆందోళనలు నెలకొన్నాయి. ప్రస్తుతం దేశంలో లీటర్ పెట్రోల్ ధర రూ.107 స్థాయిలో ఉంది. లీటర్ డీజిల్ ధర రూ.100కు సమీపంలో కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రీమియం పెట్రోల్, ఇండస్ట్రీయల్ డీజిల్ ధరలను పెంచాయి. దీంతో ధరలు భారీగా పెరుగుతాయని అర్థమవుతోంది. అయితే, మన దేశంలోనే ప్రస్తుతం లీటర్ పెట్రోల్ రూ.82కే లభిస్తోందంటే ఆశ్చరమే కదా. లీటర్ డీజిల్ సైతం రూ.78కే లభిస్తోంది. మరి అది ఎక్కడ, ఎందుకు అంత తక్కువ ధరకే లభిస్తుంది? అనే వివరాలు తెలుసుకుందాం. భారత్‌లోని ప్రధాన మెట్రో నగరాలు ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో పెట్రోల్ ధరలు గరిష్ఠ స్థాయిలో ఉన్నాయి. అయితే దేశంలోని ఓ ప్రాంతంలో మాత్రం పెట్రోల్ ధర చాలా తక్కువకే లభిస్తోందంటే మీరు ఆశ్చర్యపోతారు. లీటరు పెట్రోల్ ధర ప్రధాన నగరాలతో పోలిస్తే దాదాపు రూ.20 తక్కువకే లభిస్తోంది. ఆ ప్రాంతమే అండమాన్ నికోబార్ దీవులు. తాజా వివరాల ప్రకారం ఆ ప్రాంతంలో పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలోనే అత్యంత తక్కువకు లభిస్తున్నాయి. రూ.82కే లీటర్ పెట్రోల్లీటర్ డీజిల్ ధర రూ.78.05 వద్ద ఉంది. హైదరాబాద్, బెంగళూరు, ముంబై వంటి నగరాలతో పోలిస్తే అక్కడ పెట్రోల్, డీజిల్ ధరలు ఇంత తక్కువగా ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అండమాన్ దీవులతో పాటు దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ వంటి కేంద్ర పాలిత ప్రాంతాల్లో సైతం మిగతా రాష్ట్రాల కంటే ధరలు చాలా తక్కువగానే ఉండడం గమనార్హం.భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంటాయి. ఇందుకు మూడు ప్రధాన కారణాలు ఉంటాయి. పెట్రోల్, డీజిల్ ఇంకా జీఎస్‌టీ (GST) పరిధిలోకి తీసుకురాలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు తమ అవసరాలకు అనుగుణంగా విలువ ఆధారిత పన్ను (VAT) వసూలు చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో వ్యాట్ 35 శాతం వరకు ఉండడం గమనార్హం. అయితే అండమాన్ వంటి కేంద్ర పాలిత ప్రాంతాల్లో స్థానిక పన్నులు చాలా తక్కువగా ఉంటాయి. దీంతో తక్కువ ధరలకే పెట్రోల్, డీజిల్ లభిస్తుంది. ఆయా ప్రాంతాల్లో రాష్ట్రాల జోక్యం ఉండదు. కేవలం కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్సైజ్ డ్యూటీ ఉంటుంది. అదనపు సెస్‌లు తక్కువగా ఉండటంతో తక్కువ ధరకే ఇంధనం లభిస్తోంది.పెట్రోల్ బంకు యజమానుల కమీషన్, ఇంధనాన్ని తరలించేందుకు అయ్యే ఖర్చులు సైతం ధర నిర్ణయంలో కీలకంగా మారతాయి. అండమాన్ లాంటి ప్రాంతాల్లో తక్కువ ధరలు ఉండగా, ఇతర ప్రాంతాల్లో ఎక్కువగా ఉండడానికి కారణం ఆయా ప్రభుత్వాలు విధించే ప్రత్యేక ట్యాక్సులు. రోడ్డు అభివృద్ధి పన్ను, కాలుష్య నియంత్రణ పన్ను, సామాజిక సంక్షేమ పన్నులు అంటూ ఇలా భారీగా వసూలు చేస్తున్నారు. దీంతో పొరుగు రాష్ట్రాల మధ్య సైతం లీటరుకు రూ.5- 10 వరకు తేడా వస్తోంది.