కొందరు వాహనదారులు.. ట్రాఫిక్ చలాన్లను తప్పించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే రోడ్లపై ట్రాఫిక్ ఉల్లంఘనలు చేస్తూనే.. పోలీసులకు దొరకకుండా తిరుగుతూ ఉంటారు. ఒక వ్యక్తి.. తన కారు వైట్ నంబర్ ప్లేట్ ఉన్నప్పటికీ.. ప్రయాణికులను ఎక్కించుకుని టాక్సీ కారు లాగా వాడుకుంటున్నట్లు ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. అదే సమయంలో రోడ్లపై ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తూ.. ఏకంగా 95 చలాన్లు పడే వరకు కూడా పోలీసులకు దొరకనేలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ వాహనం ఓనర్‌ను పట్టుకుని కారును సీజ్ చేసినట్లు ఎల్బీ నగర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వెల్లడించారు. పొలదాసు సురేష్ అనే వ్యక్తి.. తన మారుతి సుజుకీ ఎర్టిగా కారు వైట్ నంబర్ ప్లేట్ (TS 09 GE 7619) ఉన్నప్పటికీ హైదరాబాద్ ఎల్బీ నగర్ నుంచి సూర్యాపేటకు నిత్యం ప్రయాణికులను తరలిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. విజయవాడ వెళ్లే రోడ్డుపై ట్రాఫిక్‌ ఎస్‌ఐ రవికుమార్‌ ఆధ్వర్యంలో చెకింగ్ చేస్తుండగా ఆ కారుపై 95 ట్రాఫిక్‌ చలానాలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ఈ మొత్తం చలానాలకు కలిపి రూ.36,600 ఫైన్లు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. పొలదాసు సురేష్.. గతంలో ట్రాఫిక్‌ పోలీసుల నుంచి 3 సార్లు తప్పించుకున్నాడని వివరించారు. అతి వేగం, నో పార్కింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ వంటి ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనలు రోజూ చేస్తూనే ఉన్నట్లు గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు.. ఆ వాహనాన్ని పట్టుకునేందుకు స్పెషల్ దృష్టి పెట్టారు. ఇప్పటికే పలుమార్లు తప్పించుకున్నప్పటికీ.. ఎట్టకేలకు ఆదివారం రోజున పొలదాసు సురేష్‌ను పట్టుకున్నారు. కేసు నమోదు చేసి.. అనంతరం పోలీసులు కారును సీజ్ చేశారు.ఇక అతడి కారుపై ఉన్న పెండింగ్ చలాన్లను చూసిన పోలీసులు షాక్ అయ్యారు. మొత్తం 95 సార్లు ట్రాఫిక్ ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించిన పోలీసులు.. ఏకంగా 95 చలాన్లు ఉన్నాయని చూసి షాక్ అయ్యారు. ఇక ఆ చలాన్ల జరిమానా మొత్తం చెల్లించాలని ట్రాఫిక్ పోలీసులు పొలదాసు సురేష్‌కు సూచించగా అతడు నిరాకరించాడు. దీంతో ఆ కారును సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక మంగళవారం రోజున కారుతోపాటు సురేష్‌ను కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆ కారుపై కేవలం 14 చలాన్లు మాత్రమే ఉన్నాయి. వాటి మొత్తం రూ.10,555గా ఉంది. అయితే మిగిలిన కొన్ని చలాన్లను ట్రాఫిక్ పోలీసులు.. పొలదాసు సురేష్‌తో కట్టించినట్లు తెలుస్తోంది. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తూ.. తప్పించుకు తిరుగుతున్న వాహనదారులు ఎప్పటికైనా తమ చేతికి చిక్కుతారని దొరుకుతారని ట్రాఫిక్ పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు.